Omicron: ఒమిక్రాన్‌ తీరు.. కొవిడ్‌కు పూర్తి భిన్నం

కొవిడ్‌-19 మహమ్మారి తీరుతెన్నులకు విరుద్ధంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ పోకడ 

Published : 17 Jan 2022 11:28 IST

ప్రముఖ వైరాలజిస్టు జాకొబ్‌ జాన్‌ వెల్లడి

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి తీరుతెన్నులకు విరుద్ధంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ పోకడ ఉందని ప్రముఖ వైరాలజిస్టు టి.జాకోబ్‌ జాన్‌ పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుతం రెండు రకాల మహమ్మారులు కొనసాగుతున్నట్లుగా భావించాలని ఆయన సూత్రీకరించారు. ఇందులో ఒకటి.. డెల్టా, దానితో ముడిపడి ఉన్న వేరియంట్ల వల్ల ఉత్పన్నమవుతోందన్నారు. రెండోది ఒమిక్రాన్‌తో తలెత్తుతోందని చెప్పారు. ఈ రెండు రకాల వల్ల కలుగుతున్న వ్యాధులూ భిన్నంగా ఉంటున్నాయని తెలిపారు. ఒకదానివల్ల నిమోనియా-హైపాక్సియా-బహుళ అవయవాలు దెబ్బతినే వ్యాధి తలెత్తుతోందన్నారు. రెండోదానివల్ల ఎగువ, మధ్య శ్వాసకోశ రుగ్మత వస్తోందని చెప్పారు. ‘‘ఒమిక్రాన్‌ తక్షణ మాతృక.. వుహాన్‌-డి614జి, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, కప్పా, మ్యూ వంటి కరోనా వేరియంట్లలో లేదని గట్టిగా చెప్పగలను. ఇది నేరుగా ఏ రకం నుంచి పుట్టుకొచ్చిందన్నది అంతుచిక్కకుండా ఉంది. అయితే దీని ‘ముత్తాత’ మాత్రం వుహాన్‌-డి614జి వేరియంటే’’ అని పేర్కొన్నారు. డి614జి అనేది వైరస్‌ ప్రొటీన్‌లోని అమినో ఆమ్లంలో జరిగిన ఉత్పరివర్తన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్‌లలో ఇది సాధారణంగా కనిపిస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడాన్ని బట్టి మూడో ఉద్ధృతి గరిష్ఠ స్థాయికి చేరినట్లు భావించొచ్చా అన్న ప్రశ్నకు.. మెట్రో నగరాల్లో ఈ ఉద్ధృతి మొదట ఆరంభమైందని, అక్కడే అది మొదట ముగుస్తుందని జాకొబ్‌ వివరించారు. భవిష్యత్‌లో రాబోయే వేరియంట్ల తీరు గురించి చెబుతూ.. అవి ఎక్కువ సాంక్రమిక శక్తిని కలిగి ఉండొచ్చని, అదే సమయంలో తక్కువ వ్యాధి తీవ్రతను కలిగిస్తాయని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని