Ukraine Crisis: అణు ఖడ్గాన్ని ఝుళిపించిన పుతిన్‌!

ఉత్తర కొరియా వంటి ఉలిపికట్టె తప్ప రెండో ప్రపంచ యుద్ధం తరవాత పెద్ద దేశమేదీ అణ్వస్తాల్రను చూపి బెదిరించిన 

Published : 26 Feb 2022 10:34 IST

అడ్డు రావొద్దంటూ అమెరికాకు హెచ్చరిక

మాస్కో: ఉత్తర కొరియా వంటి ఉలిపికట్టె తప్ప రెండో ప్రపంచ యుద్ధం తరవాత పెద్ద దేశమేదీ అణ్వస్తాల్రను చూపి బెదిరించిన సందర్భమే లేదు. గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ ఆనవాయితీని తప్పారు. ఉక్రెయిన్‌ మీద దండయాత్ర ప్రారంభించేముందు చేసిన ప్రసంగంలో ఆయన అణ్వస్త్రాల ప్రస్తావన తెచ్చారు. ‘‘సోవియట్‌ యూనియన్‌ పతనమయ్యాక గణనీయంగా వనరులు, శక్తిసామర్థ్యాలను కోల్పోయినప్పటికీ రష్యా ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన అణ్వస్త్ర రాజ్యమే. మా వద్ద ఇంకా అనేక అత్యాధునిక ఆయుధాలూ ఉన్నాయి. మా మీద ఎవరైనా దాడిచేస్తే తప్పక ఓటమి పాలవుతారు. వినాశకర పరిణామాలను ఎదుర్కొంటారు’’ అని పుతిన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను అడ్డుకోవడానికి ఇతర దేశమేదైనా సైనికంగా ప్రయత్నిస్తే అణు దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఇలా పరోక్షంగా హెచ్చరించారు. ఇది అమెరికాను ఉద్దేశించి చేసిందనడంలో సందేహం లేదు.

పుతిన్‌ అణ్వస్త్ర ప్రస్తావన తెచ్చింది ఇతరులను ఉక్రెయిన్‌కు దూరంగా ఉండాలంటూ బెదిరించడానికే కావచ్చు. అయితే అమెరికా, ఐరోపా దేశాలు జాగ్రత్త పాటించకపోతే పొరపాటునైనా, తప్పుడు అంచనాల వల్లనైనా అణు యుద్ధం సంభవించే ప్రమాదం లేకపోలేదు. 1945లో జపాన్‌పై అమెరికా అణుబాంబులు ప్రయోగించాక ప్రపంచంలో మరే దేశమూ అణ్వస్త్రాలను ప్రయోగించలేదు. రెండో ప్రపంచ యుద్ధానంతరం కొంతకాలం అణ్వస్త్రాలపై అమెరికా గుత్తాధిపత్యం కొనసాగినా, తరవాత రష్యా, చైనాలు కూడా అణ్వస్త్రాలు సమకూర్చుకున్నాయి. 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమయ్యాక ఉక్రెయిన్, బెలారస్, కజకిస్థాన్‌లు తమ భూభాగాల్లోని అణ్వస్త్రాలను స్వచ్ఛందంగా వదులుకున్నాయి. రష్యా, అమెరికాలు అణ్వస్త్రాల సంఖ్యను పరిమితం చేసుకున్నాయి. ఇటీవలికాలంలో ఉత్తర కొరియా, ఇరాన్‌లు మాత్రమే అణ్వస్త్ర ప్రమాదాన్ని గుర్తుకుతెస్తున్నాయి.

బైడెన్‌ ముందు జాగ్రత్త

ఉక్రెయిన్‌ సమస్యపై రష్యా, నాటోల మధ్య అణు యుద్ధం విరుచుకుపడే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గుర్తించారు అందుకే మొదటినుంచీ ఉక్రెయిన్‌కు నాటో సేనలను పంపబోమని స్పష్టం చేస్తూ వచ్చారు. ఆంక్షల విధింపునకే పరిమితమవుతున్నారు. రష్యా నాటో దేశాలపై దాడి చేస్తే మాత్రం పరిస్థితి మారిపోతుందని సూచించారు. మరలా అయితే పుతిన్‌ అణు బూచిని ఎందుకు ముందుకు తెచ్చినట్లు? బహుశా ఉక్రెయిన్‌లో కొన్ని ప్రాంతాలను కాకుండా దేశమంతటినీ రష్యా ఆక్రమించినా అమెరికా, నాటోలు జోక్యం చేసుకోకూడదని బెదిరించడానికి కావచ్చు. లేదా రష్యా ఇప్పటికీ అత్యంత శక్తిమంతమైన దేశమని చాటడానికి కావచ్చు. 1991లో సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలాక పుతిన్‌ పాశ్చాత్య దేశాలతో సఖ్యత కుదుర్చుకొందామని చూసినా.. అమెరికా, నాటోలు అందుకు కలిసిరాలేదు. పైగా జార్జియా, ఉక్రెయిన్‌లలో జోక్యం చేసుకున్నాయని పుతిన్‌ ఇదివరకే పలుమార్లు ఆగ్రహించారు. ఇప్పుడు తమ జోలికి వస్తే ఖబడ్దార్‌ అనడానికే అణు ఖడ్గం ఝళిపించారన్న భాష్యాలున్నాయి.

విశాల వ్యూహం ఏమిటి?

రష్యా సాయుధ దళాల్లో 80 శాతం ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించి ఉన్నందున ఆ దేశంపై పుతిన్‌ పూర్తిస్థాయి యుద్ధానికి దిగవచ్చని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. మరికొందరైతే ఉక్రెయిన్‌ సమస్యను సాకుగా తీసుకుని అమెరికా, నాటోలు రష్యాపై దండెత్తకుండా నిలువరించడానికి ఇంత భారీగా సైన్యాన్ని దించారని ప్రతిపాదిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఐరోపా గడ్డపై ఇంతటి భారీ సైన్య మోహరింపు జరగడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌ నుంచి వేరుపడిన డోన్బాస్‌ ప్రాంతంలోని దొనెట్స్క్, లుహాన్స్క్‌ ప్రాంతాలపై ఆధిపత్యంతోనే సరిపెట్టుకోకుండా మొత్తం ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తుందని భయాలు రేగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా ఒక కుదురు నుంచే వచ్చాయనీ, రెండు దేశాల ప్రజలు ఒకే జాతికి చెందినవారని పుతిన్‌ 2021లో రాసిన ఓ వ్యాసంలో ఉద్ఘాటించారు. 1991లో సోవియట్‌ పతనం తరవాత కోల్పోయిన రష్యన్‌ ప్రాభవాన్ని పునరుద్ధరించడం ఆయన లక్ష్యమని తెలుస్తూనే ఉంది. బెలారస్‌లో 30 వేల మంది రష్యన్‌ సైనికులు శాశ్వతంగా స్థావరం ఏర్పరచుకుంటారని ప్రకటించడం ద్వారా ఆ దేశం కూడా రష్యా అదుపులోనే ఉందని ప్రపంచానికి చాటారు. రష్యా, ఉక్రెయిన్, బెలారస్‌ ప్రజలు ఒకే జాతికి చెందినవారని పుతిన్‌ నమ్ముతున్నారనడానికి ఇదే నిదర్శనం. ఉక్రెయిన్‌లో అమెరికా, నాటోల ప్రత్యక్ష జోక్యాన్ని సహించబోనని, అవసరమైతే అణు యుద్ధానికి దిగుతానని పుతిన్‌ అన్యాపదేశంగా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని