Updated : 27 Jan 2022 05:24 IST

Republic Day 2022: సైనిక ధీశక్తిని చాటిన గణతంత్ర వేడుకలు

అబ్బురపరచిన ప్రదర్శనలు

ఘనంగా గణతంత్ర వేడుకలు

ప్రత్యేక అతిథులుగా ఆటో డ్రైవర్లు.. పారిశుద్ధ్య, భవన నిర్మాణ కార్మికులు

దిల్లీ: భారత 73వ గణతంత్ర వేడుకలు బుధవారం దిల్లీలో ఘనంగా జరిగాయి. దేశ సైనిక ధీశక్తిని, శక్తిమంతమైన సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రాజ్‌పథ్‌ వద్ద పరేడ్‌ సాగింది. శకటాల ప్రదర్శన, యుద్ధ విమానాల విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ... జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, త్రివిధ దళాల అధిపతులతో కలిసి అక్కడకు వెళ్లిన ప్రధాని... దేశ సేవలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ నుంచి రాజ్‌పథ్‌ చేరుకుని, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలికారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. సాయుధ దళాలు 21 తుపాకులతో వందన సమర్పణ చేశాయి. విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. 2020 ఆగస్టులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్‌ పోలీసు (ఏఎస్‌ఐ) బాబురామ్‌కు మరణానంతరం ‘అశోకచక్ర’ను ప్రకటించగా.. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన కుటుంబం ఈ పురస్కారాన్ని అందుకొంది.

పరేడ్‌ కమాండర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ విజయ్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వాన కవాతు ఆరంభమైంది. సైన్యం, నావికాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, డీఆర్‌డీవో, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు ఇందులో పాల్గొన్నాయి. సైన్యం తరఫున అశ్వికదళం, 14 మెకనైజ్డ్‌ విభాగాలు, 6 మార్చింగ్‌ కంటింజెంట్లు భాగమయ్యాయి. ధ్రువ్‌ హెలికాప్టర్లు, 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పీటీ-76, సెంచూరియన్‌ ట్యాంకులు, 75/24 ప్యాక్‌ హోవిట్జర్‌, ఎంబీటీ అర్జున్‌ ఎంకే ట్యాంకులు, ఓటీ-62 శతఘ్నులతోపాటు... పలు ఆయుధ వ్యవస్థలను, క్షిపణులను సైన్యం ప్రదర్శించింది.

* 75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని ఈసారి నౌకాదళ శకటాన్ని 1946 నాటి నావికాదళ తిరుగుబాటు అంశాన్ని ఇతివృత్తంగా తీర్చిదిద్దారు. నాడు బ్రిటిష్‌ ప్రభుత్వంపై భారతీయ నావికులు తిరుగుబాటును ప్రదర్శించి స్వాతంత్య్రోద్యమానికి దోహదపడ్డారు.

* 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలు కవాతులో పాల్గొన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల శకటాలకు కవాతులో చోటుదక్కింది. విద్య-నైపుణ్యాభివృద్ధి, పౌర విమానయానం, న్యాయశాఖ సహా తొమ్మిది శాఖల శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి.

* దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపడుతున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా... 75 విమానాలతో భారత వాయుసేన అద్భుత విన్యాసాలను ప్రదర్శించింది. రఫేల్‌, సుఖోయ్‌, జాగ్వర్‌, ఎంఐ-17, సారంగ్‌, అపాచీ, డకోటా వంటి యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. గగనతలంలో మొత్తం 15 ఆకృతులను ప్రదర్శించారు. 75 మీటర్ల పొడవు, 15 అడుగుల ఎత్తున్న పది స్కోల్స్ర్‌ను తొలిసారిగా పరేడ్‌లో ప్రదర్శించారు. వీటిని సుమారు 600 మంది ఆర్టిస్టులు తీర్చిదిద్దారు. వందే భారతం పేరిట దేశ వ్యాప్తంగా పోటీలు నిర్వహించగా, వాటిలో ఎంపికైన 480 మంది కళాకారులు ఈ సందర్భంగా ప్రదర్శనలు ఇచ్చారు.

* గణతంత్ర వేడుకలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.జ్ఞ

* పరేడ్‌ను తిలకించేందుకు వీలుగా రాజ్‌పథ్‌ వద్ద పది ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

* కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు. అయితే పలువురు ఆటో డ్రైవర్లు.. భవన నిర్మాణ, పారిశుద్ధ్య కార్మికులు, కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు ప్రత్యేక ఆహ్వానితులుగా పరేడ్‌కు విచ్చేశారు.


ప్రత్యేక వస్త్రధారణలో ఆకట్టుకున్న మోదీ..

ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. బ్రహ్మకమలం గుర్తుతో కూడిన ఉత్తరాఖండ్‌ సంప్రదాయ టోపీ, మణిపుర్‌ కండువాను ధరించారు. దేశ ప్రజలకు ఆయన రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకునేందుకు ఇదో మంచి సందర్భమంటూ ట్వీట్‌ చేశారు.


Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని