United States: రష్యా ఆయుధాలు కొనొద్దు భారత్‌కు అమెరికా ఆక్షేపణ

రష్యా నుంచి ఎస్‌ 400 క్షిపణులను కొనుగోలు చేయవద్దని భారత్‌ను వారిస్తున్నామని అమెరికా 

Published : 14 Jan 2022 11:10 IST

వాషింగ్టన్‌: రష్యా నుంచి ఎస్‌ 400 క్షిపణులను కొనుగోలు చేయవద్దని భారత్‌ను వారిస్తున్నామని అమెరికా గురువారం ప్రకటించింది. 500 కోట్ల డాలర్లకు అయిదు ఎస్‌ 400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలు రష్యా నుంచి కొనుగోలు చేయడానికి 2018లోనే భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు వ్యతిరేకించింది కూడా. ఈ నేపథ్యంలో భారత్‌కు ఎస్‌ 400 క్షిపణుల సరఫరా ఇటీవలే ప్రారంభమైంది. వీటితోపాటు రష్యన్‌ యుద్ధనౌకల కొనుగోలుకూ చర్చలు జరుగుతున్నాయి. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై కఠిన ఆంక్షలు విధించడానికి అమెరికా 2017లో కాట్సా చట్టం తెచ్చింది. అయినా నాటోలో అమెరికాతోపాటు సభ్యదేశంగా ఉన్న టర్కీ నిరుడు రష్యా నుంచి ఎస్‌ 400 వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఫలితంగా టర్కీపై అమెరికా కాట్సా కింద ఆంక్షలు విధించింది. మరిప్పుడు భారత్‌పై కూడా అలాంటి ఆంక్షలు విధించేదీ.. లేనిదీ జో బైడెన్‌ ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. భారత్‌కు కాట్సా ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) సభ్యులు బైడెన్‌ సర్కారును కోరుతున్నారు. అమెరికా ఆంక్షల విధాన సమన్వయకర్తగా జేమ్స్‌ ఓబ్రయన్‌ నియామక నిర్ధారణ సమయంలో శాసనకర్తలు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికి ఓబ్రయన్‌ భారత్, టర్కీలను పోల్చలేమని సమాధానమిచ్చారు. టర్కీకి అమెరికాతో రక్షణబంధం ఉన్నట్లే భారత్‌కు చిరకాలంగా రష్యాతో రక్షణబంధం ఉంది. అమెరికాతోపాటు టర్కీ కూడా నాటో సభ్యదేశం కాబట్టి, రష్యన్‌ ఆయుధాలు కొనవద్దని వాషింగ్టన్‌ ఒత్తిడి తెచ్చింది. భారత్‌ నాటో కూటమిలో లేనందున అలా ఒత్తిడి చేయడం కుదరకపోవచ్చు. 

అందువల్ల ‘రష్యా నుంచి ఎస్‌ 400 క్షిపణులను కొనవద్దని భారత్‌ను వారిస్తున్నాం. అదే సమయంలో చైనాతో భారత్‌కు ఏర్పడిన ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొంటున్నాం. కాబట్టి, వెనకాముందూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి’  అని ఓ బ్రయన్‌ వివరించారు. దీన్ని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ టాడ్‌ యంగ్‌ కూడా సమర్థించారు. ‘చైనాతో పోటీలో భారత్‌ మనకు కీలక మిత్రదేశంగా ఉంది. ఇప్పుడు కాట్సా పేరిట భారత్‌ను దూరం చేసుకోకూడదు. క్వాడ్‌ నుంచి భారత్‌ వైదొలగాల్సిన పరిస్థితి కల్పించకూడదు. కాబట్టి, ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా భారత్‌కు కాట్సా నుంచి మినహాయింపు ఇవ్వాలి’ అని యంగ్‌ సూచించారు. గతేడాది పాలక, ప్రతిపక్ష సెనేటర్లు మార్క్‌ వార్నర్, జాన్‌ కార్నిన్‌ కూడ ఇదే సూచన చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని