Published : 28 Oct 2021 09:34 IST

Sports news: మేటి క్రికెటర్లు.. వెరైటీ కెరీర్లు

వ్యాఖ్యాత బ్రెట్‌లీ.. బాక్సర్‌ ఫ్లింటాఫ్‌.. గిటారిస్ట్‌ కర్ట్‌లీ ఆంబ్రోస్‌.. ట్రక్‌ డ్రైవర్‌ క్రిస్‌ కెయిన్స్‌.. ఏంటిదంతా? క్రికెటర్ల ముందు వచ్చి చేరిన ఆ కొత్త కెరీర్‌లేంటి అంటారా? ప్రస్తుతం ఆ జగమెరిగిన క్రికెటర్లు చేస్తున్నది అదే. సాధారణంగా చాలామంది ఆటకు టాటా చెప్పాక కూడా మైదానాన్ని వదలరు. వ్యాఖ్యాతగా, అంపైర్లుగా, కోచ్‌లుగా, బోర్డుల్లో పెద్దలుగా క్రికెట్‌కి అనుబంధంగానే కొనసాగుతుంటారు. లేదంటే సొంత వ్యాపారాల్లోకి వెళ్లిపోతుంటారు. కానీ కొంతమంది మా రూటే సెపరేటు అన్నట్టుగా ఎవరూ ఊహించని పాత్రల్లోకి వెళ్లిపోయారు. అలాంటి వాళ్ల వివరాలు..

నటుడైన బ్రెట్‌లీ

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అభిమానులున్న క్రికెటర్లలో బ్రెట్‌లీ ఒకడు. తనకి భారత్‌తో అనుబంధం ఎక్కువే. వన్డే, టెస్ట్‌ మ్యాచ్‌ల్లో కలిసి 690 వికెట్లు తీశాడు. అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్‌గా పేరున్నవాడు. రిటైర్‌ అయ్యాక మ్యూజిక్‌, యాక్టింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నాడు. సొంతంగా ఆల్బమ్స్‌ పాడాడు. తను గిటార్‌ బాగా వాయించగలడు. కొన్ని ప్రదర్శనలు కూడా చేశాడు. మిస్ట్‌ ఆస్ట్రేలియా జెస్టినా క్యాంప్‌బెల్‌తో కలిసి ‘గెటవే’ పేరుతో ట్రావెల్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అది ఫాక్స్‌ లైఫ్‌ ఛానెల్లో ప్రసారమైంది. అంతేకాదు.. ‘అన్‌ ఇండియన్‌’ పేరుతో వచ్చిన బాలీవుడ్‌ సినిమాలోనూ నటించాడు బ్రెట్‌లీ.


రింగులో దిగిన ఆండ్రూ ఫ్లింటాఫ్‌

ఇంగ్లాండ్‌ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ని ఉత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా చెబుతుంటారు. ఏడువేల పరుగులు, 400 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. క్రికెట్‌కి వీడ్కోలు పలికిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఫ్లింటాఫ్‌ బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగాడు. అదిరిపోయే అరంగేట్రం చేశాడు. అమెరికన్‌ స్టార్‌ బాక్సర్‌, అప్పటిదాకా ఓటమన్నదే ఎరుగని రిచర్డ్‌ డాసన్‌ని మొదటి మ్యాచ్‌లోనే మట్టి కరిపించాడు. తర్వాత అడపాదడపా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాడు.


కర్ట్‌లీ ఆంబ్రోస్‌

తన జమానాలో నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మన్‌ని గడగడలాడించిన వెస్టిండీస్‌ బౌలర్‌ కర్ట్‌లీ ఆంబ్రోస్‌. 600 వికెట్లకు పైగా అంతర్జాతీయ వికెట్లు తీశాడు. బంతిని వదిలిన తర్వాత తను గిటారిస్టుగా మారాడు. ఆంటిగ్వాకు చెందిన మ్యూజిక్‌ బ్యాండ్‌లు సోకా, రెగ్గే, డ్రెడ్‌, ది బాల్డ్‌హెడ్‌ బ్యాండ్‌లలో సభ్యుడిగా చేరాడు. బాస్‌ ప్లేయర్‌గా మంచి పేరే సంపాదించాడు.


క్యాబ్‌ డ్రైవర్‌ అర్షద్‌ఖాన్‌

బ్యాట్‌తో, బంతితో పాకిస్థాన్‌కి కొన్ని చిరస్మరణీయమైన విజయాలు అందించిన క్రికెటర్‌ అర్షద్‌ఖాన్‌. తక్కువ మ్యాచ్‌లే ఆడినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినా దేశం తరపున ఆడేందుకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెళ్లి క్యాబ్‌డ్రైవర్‌గా మారాడు. మంచి ఆటగాడు ఇలా మారడం విధి వైపరీత్యం.


పరికరాలు అమ్ముతున్న క్రిస్‌ హ్యారిస్‌

క్రిస్‌ హారిస్‌ని న్యూజిలాండ్‌కి దొరికిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా భావిస్తుంటారు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, మీడియం పేసర్‌గా చాలాసార్లు సత్తా నిరూపించుకున్నాడు. హ్యారిస్‌ తన క్రికెట్‌ జీవితం ముగిసిన తర్వాత ఓ ఆర్థోపెడిక్‌ పరికరాల సంస్థలో సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా చేరాడు. ఇప్పటికీ అదే వృత్తిలో కొనసాగుతున్నాడు.


ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌

క్రికెట్‌ అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఇమ్రాన్‌ఖాన్‌కి పేరుంది. 1992లో పాకిస్థాన్‌కి ప్రపంచకప్‌ అందించాడు. ఆట నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టాడు. మొదట్లో కొన్ని వైఫల్యాలు ఎదురైనా తర్వాత ప్రజాభిమానం చూరగొని ప్రస్తుతం ఆ దేశ ప్రధాని అయ్యాడు. తన సిద్ధాంతాలు, సంస్కరణలతో ఆ దేశ ముఖచిత్రాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నాడు.


స్మగ్లర్‌ క్రిస్‌ లూయీస్‌

బ్యాట్‌, బంతితో అదరగొట్టిన ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ లూయీస్‌. కెరీర్‌ సుదీర్ఘంగా కొనసాగితే ఇయాన్‌ బోథమ్‌లా గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని భావించారంతా. కానీ అర్ధాంతరంగా మైదానాన్ని వీడాడు. తర్వాత ఎవరూ ఊహించని విధంగా స్మగ్లర్‌గా మారాడు. ద్రవరూప కొకైన్‌ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడి 13 ఏళ్ల జైలుశిక్షకి గురయ్యాడు.


కూలీగా మారిన క్రిస్‌ కెయిన్స్‌

ఫియర్‌లెస్‌ క్రికెటర్‌గా, ప్రతిభ ఉన్న ఆటగాడిగా క్రిస్‌ కెయిన్స్‌కి గుర్తింపు ఉండేది. తొంభైలలో గొప్ప ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఉండేవాడు. ఆస్తిపాస్తులూ బాగానే ఉండేవి. ఆటలో రిటైర్‌మెంట్‌ కాకముందే స్వీయ తప్పిదాలతో ఆర్థికంగా పాతాళానికి దిగజారిపోయాడు. తర్వాత రోజువారీ జీవితం గడవడానికి కూలీగా మారాడు. ట్రక్‌ డ్రైవర్‌గా పని చేశాడు. చివరికి బస్సులు కూడా శుభ్రం చేశాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని