ఆ దెబ్బతో ధోనీ అంటే ఏంటో తెలిసొచ్చింది 

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. తన రికార్డులు, పరుగుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే, అతడి కెరీర్‌ మలుపు తిరిగింది మాత్రం ఈరోజే...

Published : 05 Apr 2021 16:21 IST

మహీ కెరీర్‌లో ఇదే కీలక మలుపు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. తన రికార్డులు, పరుగుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే, అతడి కెరీర్‌ మలుపు తిరిగింది మాత్రం ఈరోజే. సరిగ్గా 16 ఏళ్ల క్రితం.. 2005 ఏప్రిల్‌ 5న విశాఖపట్నం వేదికగా పాకిస్థాన్‌తో ఆడిన రెండో వన్డేలో మహీ(148; 123 బంతుల్లో 15x4, 4x6) ఎప్పటికీ గుర్తుండిపోయే శతకం సాధించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో అతడెంత గొప్ప ఆటగాడో చాటిచెప్పాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు చుక్కలు చూపించడమే కాకుండా క్రికెట్‌లో హెలికాఫ్టర్‌ సిక్సులను పరిచయం చేశాడు. దాంతో విశేషమైన అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇది అతడి కెరీర్‌లో కీలక ఇన్నింగ్స్‌ అయిన నేపథ్యంలో నాటి మ్యాచ్‌ విశేషాలు ఒకసారి గుర్తుచేసుకుందాం.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గంగూలీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా తొలుత 356/9 భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్‌ సచిన్‌ తెందూల్కర్‌(2) విఫలమైనా వీరేంద్ర సెహ్వాగ్‌(74; 40 బంతుల్లో 12x4, 2x6), ధోనీ రెచ్చిపోయారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 96 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 122 పరుగుల వద్ద సెహ్వాగ్‌ ఔటయ్యాడు. కాసేపటికే గంగూలీ(9) పెవిలియన్‌ చేరాడు. అప్పటికి స్కోర్‌ 140/3గా నమోదైంది. ఆపై రాహుల్‌ ద్రవిడ్‌(52; 59 బంతుల్లో 3x4)తో జోడీ కట్టిన ధోనీ నాలుగో వికెట్‌కు 149 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. చివర్లో వరుసగా వికెట్లు పడినా టీమ్‌ఇండియా భారీ స్కోర్‌ సాధించింది.

అయితే, ఈ ఇన్నింగ్స్‌లో ధోనీ బ్యాటింగే హైలైట్‌. ఈ మ్యాచ్‌ ముందు వరకూ అతడు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగాడు. అయితే, తెందూల్కర్‌ అనూహ్యంగా తక్కువ స్కోరుకే ఔటవ్వడంతో ధోనీని మూడో స్థానానికి బదిలీ చేశారు.  రెచ్చిపోయిన అతడు పాక్‌ బౌలర్లకు దడ పుట్టించాడు. నాలుగు హెలికాఫ్టర్‌ షాట్లతో అభిమానులను ఉత్సాహపరిచాడు. ఇక తర్వాత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 44.1 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్‌ రజాక్‌(88; 93 బంతుల్లో 13x4, 1x6), మహ్మద్‌ యూసుఫ్‌(71; 56 బంతుల్లో 2x4, 4x6) రాణించారు. ఈ మ్యాచ్‌ తర్వాత ధోనీ అదే ఏడాది అక్టోబర్‌ 31న శ్రీలంకపై (183*; 145 బంతుల్లో 15x4, 10x6) కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని