WTC Final: సవాలుకు సిద్ధమా?
71/4తో ఉన్న జట్టు, 296 పరుగులు చేసిందంటే.. మిడిల్, లోయరార్డర్ బ్యాటర్ల పోరాట పుణ్యమే! తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసిన ఆసీస్, రెండో ఇన్నింగ్స్‌లో 123/4కు పరిమితమైందంటే బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయబట్టే!
ఇక బ్యాటర్లదే భారం
ఆసీస్ 123/4.. ఆధిక్యం 296
పోరాడిన రహానె, శార్దూల్
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 296
71/4తో ఉన్న జట్టు, 296 పరుగులు చేసిందంటే.. మిడిల్, లోయరార్డర్ బ్యాటర్ల పోరాట పుణ్యమే! తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసిన ఆసీస్, రెండో ఇన్నింగ్స్‌లో 123/4కు పరిమితమైందంటే బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయబట్టే! ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రెండో రోజు తీవ్రంగా నిరాశపరిచి.. భారత్ వెనుకంజ వేయడానికి కారణమైన టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఇక బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బౌలర్లు జోరు కొనసాగించి ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లో ఎంత తక్కువకు ఆలౌట్ చేసినా.. తొలి ఇన్నింగ్స్ లోటు వల్ల భారత్ ముందు నిలవబోయేది మాత్రం పెద్ద లక్ష్యమే. భారత్‌కు ఓటమి ముప్పు తప్పాలన్నా.. గెలుపు వైపు అడుగులు వేయాలన్నా స్టార్ బ్యాటర్లు గొప్ప ప్రదర్శన చేయాలి. మిగతా బ్యాటర్లూ తొలి ఇన్నింగ్స్ పోరాటాన్ని పునరావృతం చేయాలి.
లండన్
డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రెండు రోజులతో పోలిస్తే.. మూడో రోజు భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. అయినప్పటికీ మ్యాచ్‌లో కంగారూలదే పైచేయి. 173 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆ జట్టు.. శుక్రవారం ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో 123/4తో నిలిచింది. లబుషేన్ (41 బ్యాటింగ్; 118 బంతుల్లో 4×4), గ్రీన్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జడేజా (2/25) ఆ జట్టును దెబ్బ తీశాడు. అంతకుముందు 151/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్.. 296 పరుగులకు ఆలౌటైంది. రహానె (89; 129 బంతుల్లో 11×4, 1×6), శార్దూల్ ఠాకూర్ (51; 109 బంతుల్లో 6×4) గొప్పగా పోరాడారు. ఇప్పటికే 296 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. 400 లక్ష్యాన్ని నిర్దేశించేలా కనిపిస్తోంది. కాబట్టి ఛేదన భారత్‌కు కఠిన సవాలే. మరి తొలి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన మన స్టార్ బ్యాటర్లు ఛేదనలో ఏం చేస్తారో?
ఆ ఇద్దరికీ జడేజా చెక్
మూడో రోజు మధ్యాహ్నం వరకు భారత బ్యాటింగ్ సాగిన తీరు చూస్తే.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేసినట్లే. రహానె, శార్దూల్ అలవోకగా బ్యాటింగ్ చేసిన పిచ్ మీద.. ఆసీస్ బ్యాటర్లను బౌలర్లు బాగానే ఇబ్బంది పెట్టారు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్.. 24 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లూ కోల్పోయింది. వార్నర్ (1), ఖవాజా (13) ఇద్దరూ దాదాపుగా ఒకే తరహాలో ఆఫ్ స్టంప్ ఆవల పడ్డ బంతులను వెంటాడి మూల్యం చెల్లించుకున్నారు. వార్నర్‌ను సిరాజ్, ఖవాజాను ఉమేశ్ ఔట్ చేశారు. ఈ స్థితిలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు స్మిత్ మరోసారి భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన లబుషేన్ అతడికి చక్కటి సహకారం అందించడంతో స్కోరు బోర్డు ఊపందుకుంది. 86/2తో ఆసీస్ మెరుగైన స్థితికి చేరుకుంది. స్మిత్ (34; 47 బంతుల్లో 3×4) ప్రమాదకరంగా మారుతున్న సమయంలో జడేజా అతడికి చెక్ పెట్టాడు. అడ్డంగా షాట్ ఆడబోయిన స్మిత్.. బంతి ఎడ్జ్ తీసుకోవడంతో వెనుదిరగక తప్పలేదు. తర్వాత మరో తొలి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు హెడ్‌కు కూడా జడేజానే అడ్డుకట్ట వేశాడు. జడ్డూ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాది ఊపు మీద కనిపించిన హెడ్ (18).. తర్వాత అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమ్‌ఇండియాలో ఉత్సాహం చూస్తే.. పది ఓవర్ల దాకా మిగిలున్న ఆటలో ఇంకా ఒకట్రెండు వికెట్లు పడగొడుతుందేమో అనిపించింది. కానీ లబుషేన్.. గ్రీన్‌తో కలిసి భారత్‌కు నిరాశనే మిగిల్చాడు.
రహానె, శార్దూల్ పోరాటం
అంతకుముందు 151/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్.. ఇంకో 145 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. టీమ్‌ఇండియాకు ఆట ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రెండో బంతికే వికెట్ పడిపోయింది. వికెట్ కీపర్ బ్యాటర్ భరత్ (5)ను ఓవర్‌నైట్ స్కోరు వద్దే బోలాండ్ బౌల్డ్ చేశాడు. ఇలా ఆట మొదలైందో లేదో అలా వికెట్ పడిపోవడంతో భారత్ పతనం వైపు అడుగులేస్తుందా అనిపించింది. కానీ తొలి రోజు చూపించిన పట్టుదలనే రహానె కొనసాగించడం.. శార్దూల్ అతడికి గొప్ప సహకారం అందించడంతో భారత్ బలంగా పుంజుకుంది. ఈ జోడీ పోరాటంతో టీమ్‌ఇండియా తొలి సెషన్లో మరో వికెట్టే కోల్పోలేదు. ఎంతో నిబ్బరాన్ని ప్రదర్శించిన రహానె.. ఆసీస్ బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఓవైపు మంచి బంతుల్ని డిఫెన్స్ ఆడుతూ.. మరోవైపు చెత్త బంతి పడ్డపుడల్లా బౌండరీ బాట పట్టించాడు. శార్దూల్ ఎంతో ధైర్యంగా షాట్లు ఆడాడు. లంచ్ ముంగిట అతణ్ని కమిన్స్ ఎల్బీగా ఔట్ చేసినా.. అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. తొలి సెషన్లో రహానె, శార్దూల్ జోరుతో భారత్ 4.5 రన్‌రేట్‌తో 22 ఓవర్లలోనే 89 పరుగులు రాబట్టింది. లంచ్ విరామానికి 260/6తో భారత్ మంచి స్థితిలో కనిపించింది. రహానె, శార్దూల్ ఊపు చూస్తే భారత్ ఇంకో వంద పరుగులైనా చేస్తుందనిపించింది. కానీ లంచ్ తర్వాత కథ మారిపోయింది. విరామం నుంచి రాగానే రహానె.. కమిన్స్ బౌలింగ్‌లో స్లిప్‌లో గ్రీన్ ఒంటి చేత్తో పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. కాసేపటికే ఉమేశ్ (5)ను కూడా కమిన్స్ బౌల్డ్ చేశాడు. తర్వాత షమి (13) అండతో శార్దూల్ అర్ధశతకం పూర్తి చేశాడు. స్కోరు 300కు చేరువ అవుతుండగా.. వరుస ఓవర్లలో శార్దూల్, షమి వెనుదిరగడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీ (బి) కమిన్స్ 15; శుభ్‌మన్ (బి) బోలాండ్ 13; పుజారా (బి) గ్రీన్ 14; కోహ్లి (సి) స్మిత్ (బి) స్టార్క్ 14; రహానె (సి) గ్రీన్ (బి) కమిన్స్ 89: జడేజా (సి) స్మిత్ (బి) లైయన్ 48; భరత్ (బి) బోలాండ్ 5; శార్దూల్ (సి) కేరీ (బి) గ్రీన్ 51; ఉమేశ్ (బి) కమిన్స్ 5; షమి (సి) కేరీ (బి) స్టార్క్ 13; సిరాజ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 29మొత్తం: (69.4 ఓవర్లలో ఆలౌట్) 296
వికెట్ల పతనం: 1-30, 2-30, 3-50, 4-71, 5-142, 6-152, 7-261, 8-271, 9-294
బౌలింగ్: స్టార్క్ 13.4-0-71-2; కమిన్స్ 20-2-83-3; బోలాండ్ 20-6-59-2; కామెరూన్ గ్రీన్ 12-1-44-2; లైయన్ 4-0-19-1
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖవాజా (సి) భరత్ (బి) ఉమేశ్ 13; వార్నర్ (సి) భరత్ (బి) సిరాజ్ 1; లబుషేన్ బ్యాటింగ్ 41; స్మిత్ (సి) శార్దూల్ (బి) జడేజా 34; హెడ్ (సి) అండ్ (బి) జడేజా 18; గ్రీన్ బ్యాటింగ్ 7; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (44 ఓవర్లలో 4 వికెట్లకు) 123
వికెట్ల పతనం: 1-2, 2-24, 3-86, 4-111
బౌలింగ్: షమి 10-4-17-0; సిరాజ్ 12-2-41-1; శార్దూల్ 6-1-13-0; ఉమేశ్ 7-1-21-1; జడేజా 9-3-25-2
ప్రఖ్యాత ఓవల్ మైదానంలో టెస్టుల్లో వరుసగా మూడు అర్ధశతకాలు సాధించిన దిగ్గజ బ్యాటర్లు డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా), అలన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)ల సరసన శార్దూల్ ఠాకూర్ చేరాడు. అతను 2021లో ఇంగ్లాండ్‌పై ఈ మైదానంలో వరుసగా 57, 60 పరుగులు చేశాడు.
5020
టెస్టుల్లో రహానె పరుగులు. ఈ ఫార్మాట్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న 13వ భారత బ్యాటర్ అతను. రహానె 83వ టెస్టులో ఈ ఘనత సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: చంద్రబాబు పిటిషన్లపై విచారణ ప్రారంభం
-
Siva Karthikeyan: శివ కార్తికేయన్ మూవీ.. మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్న దర్శకుడు..!
-
Vivo Y56: వివో వై56లో కొత్త వేరియంట్.. ధర, ఫీచర్లలో మార్పుందా?
-
Canada: అందరూ చూస్తున్నారు.. పోస్టర్లు తొలగించండి..: కెనడా హడావుడి
-
IND w Vs SL w: ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు స్వర్ణం..
-
Indian Air Force: వాయుసేన చేతికి తొలి సీ-295 విమానం..!