T20 WC 2024-Rohit Sharma: 2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ

టీ20 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు స్వదేశంలో అపూర్వ ఘన స్వాగతం లభించింది. ముంబయి వీధులు నినాదాలతో హోరెత్తిపోయాయి. 

Published : 05 Jul 2024 15:15 IST

ఇంటర్నెట్ డెస్క్: రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024)ను అందుకొన్న ఏకైక భారత క్రికెటర్ కెప్టెన్ రోహిత్ శర్మ. మొదట 2007లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచిన జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి కెప్టెన్సీలోనే టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. కప్‌తో స్వదేశానికి వచ్చిన ప్లేయర్లు ముంబయిలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం వారికి వాంఖడే వేదికగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ (Rohit Sharma) తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 

‘‘2007లో భారత్ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. అప్పుడు కూడా ఇలాంటి విజయోత్సవం జరిగింది. ఇప్పుడు కూడా అభిమానులు భారీగా హాజరై మమ్మల్ని అభినందించడం ఆనందంగా ఉంది. ధోనీ (MS Dhoni) నాయకత్వంలో విజేతగా నిలవడం ఎప్పటికీ మరిచిపోలేను. అయితే, ఈసారి కప్‌ను సాధించడం మాత్రం మరింతో స్పెషల్. జట్టుకు నాయకత్వం వహించా. దేశం గర్వపడేలా చేశామని భావిస్తున్నా’’ అని తెలిపాడు.

చిన్ననాటి స్నేహితుల నుంచి గ్రాండ్‌ సెల్యూట్

ముంబయికి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మకు అతడి చిన్ననాటి స్నేహితుల నుంచి అనూహ్య అనుభవం ఎదురైంది. వారందరూ కలిసి రోహిత్‌ సెల్యూట్‌ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోహిత్ స్నేహితులతోపాటు భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ కూడా సెల్యూట్ చేసి ఆశ్చర్యపరిచాడు. టైటిల్‌ను అందుకొనే సమయంలో రోహిత్ ‘రిక్‌’ స్టైల్‌లో చేసిన వాక్‌ గుర్తుంది కదా.. ఇప్పుడు తమ స్నేహితుడిని కలిసేందుకు ఇలాంటి స్టైల్‌లోనే వారంతా వెళ్లడం గమనార్హం.

నా మనస్సు నిండిపోయింది: అశ్విన్

భారత క్రికెటర్ల (Team India) విజయోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. వీటిపై సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘‘అభిమానులు సందడి, క్రికెటర్ల జోష్‌ వీడియోలు, ఫొటోలను చూస్తే నా మనస్సు నిండిపోయింది. క్రీడల పట్ల దేశం చూపే అభిమానం ఉన్నతంగా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఛాంపియన్స్‌ మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని అశ్విన్‌ పోస్టు పెట్టాడు. 

ముంబయి పోలీసులకు కోహ్లీ థాంక్స్‌

ముంబయిలో రోడ్‌షోను విజయవంతం కావడంలో పోలీసుల కృషి మరువలేనిదని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తెలిపాడు. ఈ మేరకు వారి కోసం ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు. ‘‘టీమ్‌ఇండియా విక్టరీ పరేడ్‌ను సక్సెస్ చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు. మీ నిబద్ధత, సేవలకు హృదయపూర్వక అభినందనలు. జైహింద్‌’’ అని విరాట్ ఎక్స్‌లో పోస్టు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని