Sourav Ganguly: ఆ శతకానికి 25 ఏళ్లు

తన దూకుడు.. తన తెగువతో టీమ్‌ఇండియాను నడిపించిన సారథి సౌరవ్‌ గంగూలీ. అంతర్జాతీయ క్రికెట్లో విదేశీయుల ఆధిపత్యాన్ని ఎదురించి భారతీయుల ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు. జట్టుకు అపూర్వమైన విజయాలు అందించిన దాదా టెస్టు క్రికెట్లో అరంగేట్రంలోనే శతకంతో చెలరేగాడు....

Published : 22 Jun 2021 14:41 IST

1996, జూన్‌ 22న లార్డ్స్‌లో తొలి సెంచరీ కొట్టిన దాదా

ముంబయి: తన దూకుడు.. తన తెగువతో టీమ్‌ఇండియాను నడిపించిన సారథి సౌరవ్‌ గంగూలీ. అంతర్జాతీయ క్రికెట్లో విదేశీయుల ఆధిపత్యాన్ని ఎదురించి భారతీయుల ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు. జట్టుకు అపూర్వమైన విజయాలు అందించిన దాదా టెస్టు క్రికెట్లో అరంగేట్రంలోనే శతకంతో చెలరేగాడు. ఆఫ్‌సైడ్‌ సొగసైన కవర్‌డ్రైవ్‌లతో అలరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ కోల్‌కతా రాకుమారుడు టెస్టుల్లో తొలి శతకం బాది నేటికి 25 ఏళ్లు కావడం గమనార్హం.

క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో 1996, జూన్‌ 20న ఇంగ్లాండ్‌పై గంగూలీ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచులోనే శతకం చేసి అద్వితీయ రికార్డు నెలకొల్పాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 344 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 25 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన గంగూలీ శతక విన్యాసం చేశాడు. 301 బంతులాడి 20 బౌండరీల సాయంతో 131 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఆ సెంచరీ గురించి చాలామంది చెప్పుకుంటారు.

లార్డ్స్‌లో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా దాదా రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డేవాన్‌ కాన్వే బద్దలు కొట్టేంత వరకు ఆ రికార్డు సజీవంగానే ఉంది. ఇక బౌలింగ్‌తోనూ గంగూలీ ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు విసిరి 49 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 3 ఓవర్లు వేసి 5 పరుగులిచ్చి 1 వికెట్‌ తీయడం గమనార్హం. 113 టెస్టులాడిన సౌరవ్‌ 42.17 సగటుతో 7212 పరుగులు చేశాడు. 16 సెంచరీలు, 35 అర్ధశతకాలు బాదేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని