IND vs NZ: విలియమ్సన్‌ను త్వరగా ఔట్ చేయాలంటే.. ఇలా చేయాల్సిందే.!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్‌తో.. గురువారం నుంచి టీమ్ఇండియా టెస్టు సిరీస్‌లో భాగంగా తలపడనుంది. ఈ సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను ఎంత..

Published : 24 Nov 2021 11:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్‌తో.. గురువారం నుంచి టీమ్ఇండియా టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను ఎంత త్వరగా పెవిలియన్‌ చేరిస్తే.. భారత్‌కు అంత మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న కేన్‌.. టీమ్ఇండియాతో టెస్టు సిరీస్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌కు కూడా అతడు దూరంగా ఉన్నాడంటే.. టెస్టు క్రికెట్‌కు అతడు ఇస్తున్న ప్రాధాన్యం అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేన్‌ బలహీనతలేంటో ఓసారి చూద్దాం.!

* షార్ట్‌ పిచ్ బంతులతో..

బౌన్సర్లను అలవోకగా ఎదుర్కొనే విలియమ్సన్‌.. షార్ట్‌ పిచ్‌ బంతులను అంచనా వేయడంలో విఫలమవుతున్నాడు. వాటిని ఎదుర్కోలేక తరచూ వికెట్‌ సమర్పించుకుంటున్నాడు. కేన్‌లోని ఈ బలహీనతను భారత బౌలర్లు సద్వినియోగం చేసుకుంటే.. అతడిని త్వరగా పెవిలియన్ చేర్చవచ్చు.

* రవిచంద్రన్‌ అశ్విన్‌ vs విలియమ్సన్.. 

టెస్టుల్లో కేన్‌.. భారత స్పిన్నర్లను ఎదుర్కొవడంలో కూడా ఇబ్బందులు పడుతున్నాడు. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఇప్పటి వరకు ఐదు సార్లు ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో కూడా అశ్విన్ స్పిన్‌ మాయాజాలానికి మరోసారి విలియమ్సన్ చిక్కుతాడేమో చూడాలి. ఇంతకు ముందు మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్ ఓజా కూడా కేన్‌ను ఐదు సార్లు పెవిలియన్ చేర్చాడు. 

* పేస్‌ బౌలింగ్‌లో వికెట్ల వెనుక..

పేస్‌ బౌలింగ్‌లో కేన్‌ తరచుగా కీపర్‌కి చిక్కి క్రీజు వీడుతుంటాడు. అనూహ్యంగా స్వింగ్‌ అయ్యే బంతులతో విలియమ్సన్‌ను బోల్తా కొట్టించవచ్చు. భారత పేస్‌ విభాగానికి ఇది కలిసొచ్చే అంశం. టెస్టుల్లో కేన్‌ ఇప్పటి వరకు 19 సార్లు బౌల్డై పెవిలియన్‌ చేరాడు. 56 సార్లు క్యాచ్‌ ఔట్ కాగా, 18 సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

మరోవైపు, టీమ్‌ఇండియాకు తొలి టెస్టు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. దాంతో పాటు గత కొద్ది కాలంగా విరామం లేకుండా ఆడుతున్న టీమ్ఇండియా సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లి, మహమ్మద్‌ షమి, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజింక్య రహానె సారథ్యంలోని యువ జట్టు కివీస్‌తో తలపడనుంది.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని