Virat Kohli: రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్‌..!

క్రికెట్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ చేసిన ఓ పోస్టు ఇన్‌స్టాగ్రామ్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. వారం రోజుల్లో ఏకంగా 2 కోట్ల లైక్స్‌ను సొంతం చేసుకొంది. 

Published : 07 Jul 2024 12:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఇంటర్నెట్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత సంతోషం పంచుకొంటూ అతడు చేసిన పోస్టు పలు రికార్డులను బద్దలు కొట్టింది. కోహ్లీ-రోహిత్‌ ప్రపంచకప్‌ విజయానందం పంచుకొంటున్న చిత్రం ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 

టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో విజయం సాధించగానే ట్రోఫీని జట్టుతో కలిసి రోహిత్‌ శర్మ స్వీకరించిన ఫొటోను కోహ్లీ ఇన్‌స్టాలో షేర్‌చేశాడు. దీనికి వారం రోజుల్లో 2.09 కోట్ల లైక్స్‌ వచ్చాయి. ‘‘కలలో కూడా ఇంతకు మించిన రోజును చూడలేం. దేవుడు గొప్పవాడు. నా శిరస్సు వంచి కృతజ్ఞతలను తెలియజేసుకొంటున్నా. చివరికి మేం సాధించాం.. జైహింద్‌’’ అని ఆ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చాడు.

రికార్డులు ఇవే..

* ఓ భారతీయుడు చేసిన ఇన్‌స్టా పోస్టుకు 20 మిలియన్ల లైక్స్‌ రావడం ఇదే తొలిసారి. గతంలో బాలీవుడ్‌ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా చేసిన పోస్టు ఈ స్థానంలో ఉండేది. 

* ఓ ఇన్‌స్టా పోస్టుకు 20 మిలియన్స్‌ లైక్స్‌ అందుకొన్న తొలి ఆసియా క్రీడాకారుడిగా కోహ్లీ నిలిచాడు. 

* 20 మిలియన్ల లైక్స్‌ అందుకొన్న రెండో ఆసియా వాసి కోహ్లీ. 

* ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులు చేసిన పోస్టుల్లో అత్యధిక లైక్స్‌ పొందిన తొలి ఐదింటిలో స్థానం దక్కించుకొంది. 20 మిలియన్లతో ఐదో ప్లేస్‌లో ఉంది. ఇది అతడికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను తెలియజేస్తోంది.

ఇటీవల ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో విజయం తర్వాత విరాట్‌ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. కొత్తతరం తమ నుంచి బాధ్యతలు అందుకోవాలని పిలుపునిచ్చాడు. చివరి మ్యాచ్‌లో విరాట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని