ప్చ్‌..! చెదిరిన నాదల్‌ కల

ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ పోరాటం ముగిసింది. రోజర్‌ ఫెదరర్‌ను అధిగమించాలన్న అతడి కల నెరవేరలేదు. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ పోరులో స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. వరుసగా రెండు సెట్లు గెలిచిన అతడు చివరి మూడు సెట్లను చేజార్చుకున్నాడు...

Published : 17 Feb 2021 19:55 IST

తొలి రెండు సెట్లు గెలిచినా తప్పని ఓటమి

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ పోరాటం ముగిసింది. రోజర్‌ ఫెదరర్‌ను అధిగమించాలన్న అతడి కల నెరవేరలేదు. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ పోరులో స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. వరుసగా రెండు సెట్లు గెలిచిన అతడు చివరి మూడు సెట్లను చేజార్చుకున్నాడు. 3-6, 2-6, 7-6 (4), 6-4, 7-5 తేడాతో పరాజయం పాలయ్యాడు.

ఒక గ్రాండ్‌స్లామ్‌ మ్యాచులో నాదల్‌ రెండు సెట్ల ఆధిపత్యం సొంతం చేసుకోవడం ఇది 225వ సారి కావడం విశేషం. కేవలం రెండుసార్లు మాత్రమే ఆ ఆధిపత్యాన్ని కోల్పోయి ఓటమి పాలవ్వడం గమనార్హం. కొన్ని అనవసర తప్పిదాలు, బ్యాక్‌హ్యాండ్‌ లోపాలతో మూడో సెట్‌ ట్రైబేకర్‌లో అతడికి చుక్కెదురైంది. పురుషుల విభాగంలో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకోవాలన్న కల చెదిరిపోయింది. ప్రస్తుతం నాదల్‌, ఫెదరర్‌ అత్యధికంగా చెరో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో సమానంగా ఉన్నారు.

తొలి రెండు సెట్లలో ఎక్కడ బంతిని ఆడాలనుకున్నాడో కచ్చితత్వంతో ఆడిన నాదల్‌ వరుసగా 27 పాయింట్లు సాధించాడు. మేజర్‌ టోర్నీల్లో వరుస సెట్లను గెలుచుకున్న సంఖ్యను 35కు తీసుకెళ్లాడు. కానీ యువకుడైన సిట్సిపాస్‌ ఊరుకోలేదు. పట్టుదలతో పోరాడాడు. అద్భుతమైన ఆటతీరుతో మూడోసెట్లో టైబ్రేకర్‌ను గెలుచుకున్నాడు. నాలుగో సెట్‌ను సునాయసంగా గెలిచాడు. ఐదో సెట్లో కఠిన పోటీ ఎదురైనా నాదల్‌కు విజయం దక్కనివ్వలేదు. శుక్రవారం జరిగే సెమీస్‌లో అతడు 2019 యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌ డేనిల్‌ మెద్వెదెవ్‌తో తలపడనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని