IND vs ENG: ఇంగ్లాండ్‌పై పరుగుల వరద పారించిన భారత ఆటగాళ్లు వీరే..

భారత్, ఇంగ్లాండ్ రెండు మేటి జట్లే. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా ఏ విభాగంలో చూసిన రెండు జట్లు

Updated : 22 Aug 2021 11:40 IST

భారత్, ఇంగ్లాండ్ రెండు మేటి జట్లే. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా ఏ విభాగంలో చూసినా పటిష్ఠంగా ఉంటాయి. ఈ ఇరు జట్లు తలపడితే అభిమానులకు పండగే. అదీ సుదీర్ఘ ఫార్మాట్ అయితే ఆ మజా మరింత పెరుగుతుంది. ప్రస్తుతం టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఆంగ్లేయ జట్టుపై టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లెవరో  తెలుసుకుందాం..

‘మాస్టర్‌’ మామూలుగా ఆడలేదు..

‘గాడ్‌ ఆఫ్ క్రికెట్‌’గా పేరొందిన సచిన్‌ తెందూల్కర్‌.. క్రీజులో ఉన్నాడంటే ఎంత దిగ్గజ బౌలర్‌ అయినా భయపడతాడు. ఎందుకంటే మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను బౌండరీలకు పంపడం సచిన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇక, ఇంగ్లాండ్‌పై మాస్టర్‌ బ్లాస్టర్‌ టెస్టుల్లో పరుగుల వరద పారించాడు. ఈ జట్టుపై 53 ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్.. 51.73 సగటుతో 2535 పరుగులు సాధించి ఆంగ్లేయ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. మొత్తం మ్మీద ఇంగ్లాండ్‌పై ఏడు శతకాలు, 13 అర్ధశతకాలు చేశాడు. 2002 సంవత్సరం లీడ్స్‌లో జరిగిన టెస్టులో ఆతిథ్య జట్టుపై అత్యధికంగా 193 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సన్నీ...దంచేశాడు

సునీల్ గావస్కర్‌.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. సన్నీ క్రీజులో ఉంటే పరుగులకు ఢోకా లేదని అప్పట్లో భావించేవారు. నిలకడైన ఆటతీరుతో టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలనందించాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై 67 ఇన్నింగ్స్‌లు ఆడిన గావస్కర్‌.. 38.20 సగటుతో 2483 పరుగులు సాధించాడు. దీంతో సచిన్ తర్వాత ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సన్నీ ఇంగ్లాండ్‌పై నాలుగు శతకాలు, 16 అర్ధశతకాలు చేశాడు. మరో విశేషమేమిటంటే టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి క్రికెటర్‌ సునీల్‌ గావస్కరే.

ది వాల్‌.. వండర్స్‌

‘డిఫెన్స్‌ కింగ్’ రాహుల్‌ ద్రవిడ్  ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రీజులోకి వచ్చాడంటే పాతుకుపోయి వికెట్ల ముందు గోడల నిలబడే రాహుల్‌.. ఓపిగ్గా బంతులు ఎదుర్కొంటూ పరుగులు రాబట్టేవాడు. ఇక, ద్రవిడ్‌కు ఇంగ్లాండ్‌పై మంచి రికార్డే ఉంది. ఈ జట్టుపై 37 ఇన్నింగ్స్‌లు ఆడిన ‘ది వాల్‌’... 60.93 సగటుతో 1950 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్‌పై  217 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును చేశాడు. తన కెరీర్‌లో 164  టెస్టులు ఆడిన ద్రవిడ్... 52.31 సగటుతో  13,288 పరుగులు సాధించాడు.

గుండప్ప.. అదరగొట్టాడు

1970ల్లో  గుండప్ప విశ్వనాథన్‌  భారత టెస్టు క్రికెట్‌లో మంచి బ్యాట్స్‌మన్.  విశ్వనాథన్‌కు టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై మెరుగైన రికార్డు ఉంది. ఈ జట్టుపై 54 ఇన్నింగ్స్‌లు ఆడిన గుండప్ప.. 37.60 సగటుతో 1880 పరుగులు సాధించాడు. ఇదే జట్టుపై 222 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించాడు.  అంతేకాదు అరంగేట్ర టెస్టులోనే (ఆస్ట్రేలియాపై) శతకం(137) బాది రికార్డుల్లోకెక్కాడు.  ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం మ్మీద భారత్ తరఫున 91 మ్యాచ్‌లు ఆడిన గుండప్ప.. 41.93 సగటుతో 6080 పరుగులు చేశాడు. ఇందులో 14 శతకాలు, 35 అర్ధశతకాలున్నాయి.

రఫ్పాడిస్తున్న.. రన్‌ మెషీన్

నేటి తరం మేటి ఆటగాడు, టీమ్‌ఇండియా ‘రన్‌ మెషీన్‌’, ప్రస్తుత  భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇంగ్లాండ్‌పై పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో విరాట్‌ బ్యాట్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ రాకపోయినా.. గతంలో జరిగిన సిరీస్‌ల్లో ఇంగ్లాండ్‌ బౌలర్లను విరాట్ ఉతికారేశాడు. 2016లో ముంబయి వేదికగా జరిగిన టెస్టులో 235 పరుగుల భారీ స్కోరు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ 36 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌పై 44 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 44.00 సగటుతో 1804 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలున్నాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని