పంత్‌ను తీసుకుంటే సాహాకేం చెప్తారు?

బాక్సింగ్‌డే టెస్టులో టీమ్‌ఇండియా చేసే మార్పులపై మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. తాజాగా తన ఫేస్‌బుక్‌లో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

Published : 24 Dec 2020 15:11 IST

దిల్లీ: బాక్సింగ్‌డే టెస్టులో టీమ్‌ఇండియా చేసే మార్పులపై మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. తాజాగా తన ఫేస్‌బుక్‌ ఖాతాలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టులో ఆడిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పేసర్‌ మహ్మద్‌ షమి రెండో టెస్టుకు దూరమవ్వడాన్ని పక్కనపెడితే సుమారు ఐదు మార్పులతో భారత్‌ బరిలోకి దిగనుందని చెప్పాడు. అందులో శుభ్‌మన్‌గిల్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, రిషభ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైని లేదా మహ్మద్‌ సిరాజ్‌ ఉంటారన్నాడు.

పృథ్వీకి బదులు శుభ్‌మన్‌ లేదా రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తారని, మూడో టెస్టులో మళ్లీ  
రోహిత్‌ అందుబాటులోకి వస్తే ఎవరో ఒకరు తప్పుకోవాల్సిందేనని చోప్రా సందేహం వెలిబుచ్చాడు. ఇక నాలుగో స్థానంలో రహానె బ్యాటింగ్‌ చేస్తుండగా, ఐదులో మళ్లీ రిషభ్‌పంత్‌ ఉంటాడని, తర్వాత రవీంద్ర జడేజా ఆడతాడని చెప్పాడు. ఈ క్రమంలోనే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ హానుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా చోటు కోల్పోతారన్నాడు. విహారి కచ్చితంగా తుది జట్టులో ఉండాలని మాజీ ఓపెనర్‌ సూచించాడు. అయితే, అతడి స్థానంలో జడేజాను ఆడిస్తారనే సమాచారం అందిందని తెలిపాడు. 

ఇటీవలి కాలంలో విహారి బాగానే ఆడుతున్నాడని, అతడిని పక్కకు తప్పించడానికి కారణమేంటో ఎవరికీ తెలియదని చెప్పాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో అర్ధశతకం, ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో శతకం సాధించాడని చోప్రా గుర్తుచేశాడు. ఇక కోహ్లీ లేనందును బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మరింత బలం చేకూరేందుకు సాహాకు బదులు పంత్‌ను తీసుకొస్తారని తెలిపాడు. ఈ నేపథ్యంలో యువ బ్యాట్స్‌మన్‌ను తీసుకుంటే సాహాకు ఏం చెప్పి తొలగిస్తారని ఆకాశ్‌ చోప్రా ప్రశ్నించాడు. 

ఇవీ చదవండి..

కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. !

కోహ్లీ స్థానంలో సెహ్వాగ్‌ ఉంటే..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని