
ఆ కోహ్లీకి, ఈ కోహ్లీకి చాలా తేడా ఉంది
2011, 2019 ప్రపంచకప్ జట్ల పోలిక..
ఇంటర్నెట్‌డెస్క్: 2011 ప్రపంచకప్ జట్టులోని విరాట్ కోహ్లీకి 2019లోని టీమ్ఇండియా సారథికి ఎంతో తేడా ఉందని మాజీ టెస్టు క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ధోనీ సారథ్యంలోని భారత జట్టు అప్పుడు వన్డేల్లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ నుంచే నిష్క్రమించిన విషయమూ తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు జట్ల నడుమ ఉన్న తేడాను చోప్రా వివరించాడు. సోమవారం తన ఆకాశ్వాణి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ అప్పటి టీమ్ఇండియాను ఇప్పటి జట్టుతో పోల్చి చూశాడు.
ఓపెనర్ల విషయంలో రోహిత్ శర్మ, సచిన్ తెందూల్కర్‌ను పోల్చగా ఇద్దరిలో ఎవర్ని ఎంచుకోవాలో కష్టమని చెప్పాడు. ఇక సెహ్వాగ్‌ను కేఎల్ రాహుల్/శిఖర్ ధావన్‌లతో పోల్చితే ధావన్‌ను ఎంపిక చేస్తానన్నాడు. అనంతరం కోహ్లీ, గంభీర్‌లను పోలుస్తూ నిస్సందేహంగా ప్రస్తుత సారథినే ఎంచుకుంటానని చెప్పాడు. కోహ్లీ రెండు ప్రపంచకప్‌లలో ఆడినా 2011తో పోలిస్తే 2019 నాటికి ఎంతో మారాడని తెలిపాడు. ఇక నాలుగో నంబర్ ఆటగాడిగా అప్పటి ఛాంపియన్ యువరాజ్ సింగ్‌ను ఎంపిక చేస్తానన్నాడు. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్య, రైనాను పోలిస్తే.. సీనియర్ బ్యాట్స్‌మనే బాగా ఆడతాడని చెప్పాడు. ఇక ధోనీ విషయంలో 2011 నాటి సారథి అద్భుతమని మెచ్చుకున్నాడు.
అనంతరం బౌలింగ్ విభాగంపై స్పందిస్తూ.. హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజాను పోల్చి చూస్తే.. ఇద్దరూ సమానమని, భజ్జీ బౌలింగ్‌లో ఇరగదీస్తే జడ్డూ బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో రాణిస్తాడన్నాడు. అలాగే అప్పటి మునాఫ్ పటేల్ కన్నా ఇప్పటి మహ్మద్ షమి మేలన్నాడు. కుల్దీప్/చాహల్‌తో పోలిస్తే నెహ్రా ముందుంటారని వెల్లడించాడు. చివరగా బుమ్రా, జహీర్ ఖాన్ ఇద్దరూ మ్యాచ్ విన్నర్లేనని వెల్లడించాడు. ఇలా రెండు జట్లనూ పోల్చి చూస్తే 2019 కన్నా 2011 జట్టే ఉత్తమ జట్టని, అందుకే అది విజేతగా నిలిచిందని పేర్కొన్నాడు.