పాండ్య నాణ్యమైన బ్యాట్స్‌మన్‌: ఆకాశ్‌

నైపుణ్యం గల బ్యాట్స్‌మెన్‌ కన్నా అతడేం చేయగలడో నిరూపించాడని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ తీరును మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ప్రశంసించాడు...

Updated : 29 Nov 2020 04:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నైపుణ్యం గల బ్యాట్స్‌మెన్‌ కన్నా అతడేం చేయగలడో నిరూపించాడని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ తీరును మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ప్రశంసించాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో తలపడిన తొలి వన్డేలో పాండ్య(90) తృటిలో శతకం కోల్పోయిన సంగతి తెలిసిందే. అతడున్నంత సేపు భారత శిబిరంలో ఆశలు నిలిపాడని ఆకాశ్‌ పేర్కొన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడిన చోప్రా ఈ మ్యాచ్‌పై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా పాండ్య ఆటను పొగడ్తలతో ముంచెత్తాడు. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడని, మున్ముందు కూడా ఇలాగే బ్యాటింగ్‌ చేస్తాడని కొనియాడాడు. ఇంత కీలకమైన ఆటగాడు ఆరో స్థానంలో ఆడుతున్నాడని, త్వరలోనే అతడు నాలుగైదు స్థానాలకు మారుతాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. 

‘ వచ్చిన అవకాశాన్ని పాండ్య సద్వినియోగం చేసుకున్నాడు. ఒక నాణ్యమైన బ్యాట్స్‌మన్‌ ఆరో స్థానంలో ఆడటం ఎన్నిసార్లు కుదురుతుంది? అతడికి ఆ అవకాశం రావడంతో నిరూపించుకున్నాడు. తన ఆటతీరుతో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కన్నా ఎక్కువే ఆడగలనని చాటిచెప్పాడు. ఇతరులు షార్ట్‌పిచ్‌ బంతులతో సతమతమయితే అతడు మాత్రం వాటిని దీటుగా ఎదుర్కొన్నాడు. స్పిన్నర్లను కూడా ఉతికారేశాడు. తృటిలో సెంచరీ కోల్పోయినా క్రీజులో ఉన్నంతసేపు ఆశలు నింపాడు. ధావన్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా అతడే 75 పరుగులు చేశాడు. పాండ్య అద్భతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. త్వరలోనే నాలుగు లేదా ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తాడు’ అని మాజీ క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 374/6 భారీ స్కోర్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఆరోన్‌ ఫించ్‌(114), స్టీవ్‌స్మిత్‌(105) శతకాలతో మెరవగా భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. పాండ్య(90), ధావన్‌(74) అర్ధ శతకాలు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని