వైద్యుల మాటలను కాదనలేం: ఫించ్‌

భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో రవీంద్ర జడేజాకు బదులు యుజువేంద్ర చాహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆడించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ స్పందించాడు...

Updated : 20 Sep 2022 15:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో రవీంద్ర జడేజాకు బదులు యుజువేంద్ర చాహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆడించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ స్పందించాడు. వైద్యుల మాటలను కాదనలేమని అన్నాడు. అసలేం జరిగిందంటే.. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా(44*) బ్యాటింగ్‌ చేస్తుండగా ఆఖరి ఓవర్‌లో తలకు గాయమైన సంగతి తెలిసిందే. ఒక బంతి హెల్మెట్‌కు బలంగా తాకడంతో వైద్యుల సూచన మేరకు టీమ్‌ఇండియా అతడిని రెండో ఇన్నింగ్స్‌లో కొనసాగించలేదు. దీంతో చాహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకుంది. అతడు 3/25 అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

అయితే, చాహల్‌ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రావడంపై ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మ్యాచ్‌ జరుగుతుండగానే అభ్యంతరం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ రిఫరీతో వాగ్వాధానికి దిగాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ఆ జట్టు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌.. జడేజాకు తగిలిన గాయంపై వైద్యుల మాటలను కాదనలేమని చెప్పాడు. ‘కంకషన్‌ కారణంగా టీమ్‌ఇండియా ఫిజియో జడేజాను ఆడనివ్వలేదు. వైద్య నిపుణుల అభిప్రాయాలను ఎదురించలేం. అయితే, టీమ్‌ఇండియా బ్యాటింగ్ చేస్తుండగా ఆఖరి ఓవర్లలో మేం ధారాళంగా పరుగులిచ్చాం. ఆపై ఛేదనలోనూ చివరి ఓవర్లలో ధాటిగా ఆడి బౌండరీ సాధించలేకపోయాం. అదే మా ఓటమికి కారణం’ అని ఫించ్‌ వివరించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా అవకాశం వచ్చి తన బౌలింగ్‌తో సత్తా చాటిన చాహల్‌ మాట్లాడుతూ.. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభానికి పది నిమిషాల ముందే తాను సబ్‌స్టిట్యూట్‌గా ఆడుతున్నట్లు తెలిసిందని చెప్పాడు. ఇప్పటికే పలు మ్యాచ్‌లు ఆడినందున మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడం జంపా బౌలింగ్‌ చేసినట్టే తాను చేయాలనుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై 150-160 స్కోర్‌ మంచిదని, తన ప్రణాళిక ప్రకారం బౌలింగ్‌ చేశానని యూజీ వివరించాడు. కాగా, రెండో టీ20 ఆదివారం సిడ్నీ వేదికగా జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని