జింక్స్‌ ఒక సెంచరీ.. పలు రికార్డులు..

టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె రెండో టెస్టులో అదరగొడుతున్నాడు. శనివారం తన వ్యూహాలతో బౌలింగ్ త్రాయన్ని సమృద్ధిగా ఉపయోగించుకున్న అతడు ఆస్ట్రేలియాను తక్కువ...

Published : 28 Dec 2020 01:11 IST

దిగ్గజాల సరసన నిలిచిన తాత్కాలిక కెప్టెన్‌..

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె రెండో టెస్టులో అదరగొడుతున్నాడు. శనివారం తన వ్యూహాలతో బౌలింగ్‌త్రయాన్ని సమృద్ధిగా ఉపయోగించుకున్న అతడు ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకు పరిమితం చేసేలా చేశాడు. అలాగే ఆదివారం సైతం తనదైన బ్యాటింగ్‌తో క్లాసికల్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా ప్రతిష్ఠాత్మకమైన మెల్‌బోర్న్‌ మైదానంలో శతకం బాదడమే కాకుండా పలు ఆసక్తికర రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే పలువురు దిగ్గజ ఆటగాళ్ల సరసన చోటు సంపాదించుకున్నాడు.

వినో మన్కడ్‌ తర్వాత రహానె..
ఆదివారం రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి జడేజా(40*)తో కలిసి 104 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన రహానె(104‌*) టెస్టుల్లో 12వ శతకం బాదాడు. దీంతో మెల్‌బోర్న్‌లో రెండో శతకం బాదిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు వినోమన్కడ్‌ ఆ ఘనత సాధించారు. ఇక రహానె 2014లో టెస్టు సిరీస్‌ సందర్భంగా ఇదే మైదానంలో తొలిసారి మూడంకెల స్కోరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

సచిన్‌ సరసన చేరాడు..

ఇక ఇదే శతకంతో రహానె క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సరసన కూడా నిలిచాడు. 1999లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా వ్యవహరించిన మాస్టర్‌ బ్లాస్టర్‌ నాటి మెల్‌బోర్న్‌ టెస్టులో శతకంతో మెరిశాడు. ఆ తర్వాత భారత కెప్టెన్‌గా ఈ మైదానంలో సెంచరీ కొట్టింది ఈ ముంబయి బ్యాట్స్‌మనే. ఇదిలా ఉండగా, రహానె ఇదే రికార్డుపై ఆసియా కెప్టెన్ల జాబితాలోనూ చోటు సంపాదించుకున్నాడు. తెందూల్కర్‌, హనీఫ్‌ మహ్మద్‌, మహ్మద్‌ యూసుఫ్‌ తర్వాత మెల్‌బోర్న్‌లో సెంచరీ చేసిన కెప్టెన్‌గా నేడు కొత్త రికార్డు నమోదు చేశాడు.

భారత్‌ తరఫున ఐదో సారథి..
మరోవైపు ఇదే శతకంతో రహానె భారత కెప్టెన్‌గా ఇంకో ఘనత కూడా సాధించాడు. ఆస్ట్రేలియాలో ఇంతకుముందు మహ్మద్‌ అజహరుద్దీన్‌, సచిన్‌ తెందూల్కర్‌, సౌరభ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీలాంటి దిగ్గజాలు కెప్టెన్లుగా శతకాలు బాదారు. వారి తర్వాత రహానె నేడు ఐదో కెప్టెన్‌గా ఆ ఘనత సాధించాడు. దీంతో ఒకే ఒక్క శతకంతో అజింక్య ఇన్ని రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే సోమవారం మరో 96 పరుగులు సాధిస్తే మెల్‌బోర్న్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(195) రికార్డును రహానె అధిగమించే వీలుంది. అదే జరిగితే ఇక్కడ రెండొందల మార్కును కూడా జింక్స్‌ అందుకునే అవకాశం ఉంది.

ఇవీ చదవండి..
రహానె శతకం.. భారత్‌ ఆధిపత్యం
ఆస్ట్రేలియాపై పంత్‌ కొత్త రికార్డు..
కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని