కాసిన్ని కవ్వింపులుంటే బాగుండు

భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో కాసిన్ని కవ్వింపులుంటే బాగుండని మాజీ క్రికెటర్లు అజిత్‌ అగార్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డారు...

Published : 07 Dec 2020 11:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో కాసిన్ని కవ్వింపులుంటే బాగుండని మాజీ క్రికెటర్లు అజిత్‌ అగార్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ సరదాగా అన్నారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇరు జట్ల ఆటగాళ్లలో మార్పు వచ్చిందని, మైదానంలో సరదాగా కనిపిస్తున్నారని అగార్కర్‌ పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ఛేదనకు దిగిన వేళ ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌(52) ధాటిగా ఆడాడు. ఒకానొక సందర్భంలో అతడు క్రీజులో కాలుపైకి లేపడంతో కీపర్‌ మాథ్యూవేడ్‌ స్టంపౌట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అది రీప్లేలో నాటౌట్‌గా తేలింది. 

ఆ సంఘటన అనంతరం వేడ్‌.. ధావన్‌తో మాట్లాడుతూ ‘నేను ధోనీ కాదు. అతడంత వేగంగా స్టంపౌట్‌ చేయలేను’ అని పేర్కొన్నాడు. దానికి ధావన్‌ నవ్వేసి ఊరుకున్నాడు. ఇద్దరి మధ్యా హాస్యాస్పద ఘటన చోటుచేసుకోవడం స్టంప్‌ మైక్‌లో వినిపించింది. దీంతో అగార్కర్‌, మంజ్రేకర్‌ సైతం నవ్వుకొని ఇలా స్పందించారు. ‘వేడ్‌ చెప్పింది నిజమే. అతడు ధోనీ అంతటి వేగవంతం కాదు. అయితే, అవన్నీ సవాళ్లతో కూడుకున్నవి. అలాగే మైదానంలో చాలా మంచి వాతావరణం నెలకొంది. ఆటగాళ్లు సరదాగా నవ్వుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకులకు మరీ బోర్‌ కొట్టకుండా కాసిన్ని కవ్వింపులుంటే ఇంకా బాగుంటుంది’ అని అగార్కర్‌ పేర్కొన్నాడు. అనంతరం మంజ్రేకర్‌ అందుకొని.. ‘ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్‌లో బాగా మార్పు వచ్చింది. ముఖ్యంగా బాల్‌టాంపరింగ్‌ వివాదం తర్వాత ఆ మచ్చని తొలగించుకోవాలని చూస్తున్నారు’ అని అన్నాడు. ఇక ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం కూడా ఇంకో కారణమని తెలిపాడు. మరోవైపు కంగారూలు ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదని, టెస్టు సిరీస్‌ ప్రారంభమైతే అసలు విషయం తెలుస్తుందని మాజీ బ్యాట్స్‌మన్‌ వివరించాడు. తాను అజిత్‌లాగే ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడకూడదని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. 

ఇవీ చదవండి:
లెక్క సరి
టీమిండియాలోకి మరో ధోనీ వచ్చాడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని