ఓడిపోయి లక్షల హృదయాల్లో నిలిచాడు

ఓ అథ్లెట్‌ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి జనాలు జేజేలు పలుకుతున్నారు..

Updated : 22 Sep 2020 12:31 IST

అథ్లెట్‌ క్రీడాస్ఫూర్తికి అభినందనల వెల్లువ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ అథ్లెట్‌ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి జనాలు జేజేలు పలుకుతున్నారు. సామాజిక మాధ్యమాలు అతడి హుందాతనానికి ఫిదా అవుతున్నాయి. ఓడిపోయినా లక్షలమంది హృదయాల్లో నిలిచావంటూ కొనియాడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ట్రయథ్లాన్‌ (పరుగుపందెం సహా పలు పోటీలు) నిర్వహించారు. స్పెయిన్‌కు చెందిన అథ్లెట్‌ డియాగో మెట్రిగో అప్పటికే చాలా దూరం పరుగుతీశాడు. కానీ విజయతీరాలకు చేరే కొన్ని సెకన్ల ముందు అనూహ్యంగా నెమ్మదించాడు. అదే వేగంతో పరిగెడితే మూడోస్థానం దక్కించుకొని కాంస్య పతకం సాధించేవాడు. కానీ అప్పుడే అద్భుతమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు.

తన కంటే ముందు పరిగెడుతున్న బ్రిటిష్‌ అథ్లెట్ జేమ్స్‌ టియాగిల్‌ చివరి సెకన్లలో ట్రాక్‌ తప్పడాన్ని మెట్రిగో గమనించాడు. అలాగే మరికొన్ని సెకన్లపాటు పరిగెడితే మెట్రిగో మూడోస్థానం దక్కించుకునేవాడే కానీ అతడు అలా చేయలేదు. గమ్యస్థానానికి చేరుకున్నప్పటికీ ముగింపు గీత దాటకుండా ఉండిపోయాడు. తనకంటే ముందుస్థానంలో నిలిచేందుకు అర్హుడైన జేమ్స్‌నే ముందు గీతదాటేలా చూశాడు. దీంతో కృతజ్ఞతా భావంతో జేమ్స్‌ టియాగిల్‌ మెట్రిగోకు ధన్యవాదాలు తెలియజేశాడు. డియాగో క్రీడాస్ఫూర్తిని అక్కడ ఉన్న ప్రేక్షకులు సైతం కరతాళధ్వనులతో మెచ్చుకున్నారు. దీనిపై స్పందించిన స్పానిష్‌ అథ్లెట్‌  ‘పందెంలో అతడు నిత్యం నాకంటే ముందే ఉన్నాడు. అతడు దీనికి అర్హుడు’ అని అన్నాడు. ప్రస్తుతం ఆ పరుగుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.  ట్విటర్‌లో పోస్టు చేసిన ఆ వీడియోను ఇప్పటికే 6.8 మిలియన్ల మంది వీక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని