Updated : 08 Dec 2020 18:21 IST

కోహ్లీ పోరాడినా భారత్‌కు తప్పని ఓటమి

12 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం

ఇంటర్నెట్‌డెస్క్: విరాట్ కోహ్లీ (85; 60 బంతుల్లో, 4×4, 3×6) పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా అయిదు వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్‌ (80; 53 బంతుల్లో, 7×4, 2×6), మాక్స్‌వెల్‌ (54; 36 బంతుల్లో, 3×4, 3×6) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. స్వెప్సన్‌ (3/23) టీమిండియాను ఘోరంగా దెబ్బతీశాడు. ఈ విజయంతో ఆసీస్‌ 1-2తో మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ తప్పించుకుంది.

భారత్‌ లక్ష్య ఛేదన సాఫీగా సాగలేదు. మాక్స్‌వెల్ వేసిన తొలి ఓవర్‌లోనే కేఎల్ రాహుల్‌ డకౌటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ.. శిఖర్ ధావన్‌ (28; 21 బంతుల్లో, 3×4)తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. క్యాచ్‌లు చేజార్చి ఆసీస్‌ ఇచ్చిన అవకాశాల్ని విరాట్ సద్వినియోగం చేసుకున్నాడు. ధావన్‌తో కలిసి బౌండరీలు బాదుతూ రన్‌రేటును నియంత్రణలో ఉంచాడు. అయితే గబ్బర్‌ను స్వెప్సన్‌ ఔట్‌ చేసి స్కోరువేగానికి బ్రేక్‌లు వేశాడు. తన తర్వాత ఓవర్‌లోనే సంజు శాంసన్‌ (10), శ్రేయస్ అయ్యర్‌(0)ను ఔట్ చేసి స్వెప్సన్‌ టీమిండియాను కోలుకోలేని దెబ్బతీశాడు.

ఆసీస్‌ను భయపెట్టినా..

తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్‌ పాండ్య (20; 13 బంతుల్లో)తో కలిసి కోహ్లీ మరో వికెట్ పడకుండా కాస్త జాగ్రత్తగా ఆడటంతో విజయ సమీకరణం ఆఖరి 5 ఓవర్లలో 76 పరుగులుగా మారింది. అనంతరం హార్దిక్‌తో కలిసి కోహ్లీ టాప్‌ గేర్‌లోకి వెళ్లాడు. వీరిద్దరు సొగసైన బౌండరీలు, సిక్సర్లతో లక్ష్యాన్ని కరిగించారు. ఆండ్రూ డేనియల్‌ బౌలింగ్‌లో కళ్లుచెదిరే సిక్సర్లతో అలరించారు. దీంతో విజయానికి 18 బంతుల్లో 43 పరుగులు అవసరమయ్యాయి. అయితే ధాటిగా ఆడుతున్న హార్దిక్‌ను జంపా ఔట్ చేసి మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడు. మరోవైపు కోహ్లీ క్రీజులోనే ఉండటంతో భారత్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే 19వ ఓవర్‌లో విరాట్ ఔటవ్వడంతో టీమిండియా‌ ఓటమి లాంఛనమైంది. ఆఖర్లో సుందర్ (7)తో కలిసి శార్దూల్ ఠాకూర్ (17*; 7 బంతుల్లో, 2×6) కంగారూలను కంగారు పెట్టించినా అద్భుతాలేమి జరగలేదు. ఆసీస్‌ బౌలర్లలో స్వెప్సన్ మూడు, జంపా, మాక్సీ, అబాట్ తలో ఒక వికెట్ తీశారు.

మాక్సీ-వేడ్‌ ధనాధన్

భారత్ పేలవమైన ఫీల్డింగ్‌ ఆస్ట్రేలియాకు లాభమైంది. అందివచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేసి కంగారూలకు టీమిండియా అవకాశాలు ఇచ్చింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన కెప్టెన్‌ ఫించ్‌ను ఖాతా తెరవకముందే సుందర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్మిత్‌ (24; 23 బంతుల్లో, 1×4)తో కలిసి వేడ్‌ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే బౌండరీలు సాధించారు. దీంతో ఆ జట్టు పవర్‌ప్లేలో 51 పరుగులు చేసింది. అయితే స్మిత్‌ను బోల్తాకొట్టించి 65 పరుగుల వారిద్దరి భాగస్వామ్యానికి సుందర్‌ తెరదించాడు.

ఆ తర్వాత కోహ్లీసేనకు ఆసీస్‌ అవకాశమే ఇవ్వలేదు. మాక్స్‌వెల్‌తో కలిసి వేడ్‌ దూకుడుగా ఆడాడు. మాక్సీ స్విచ్‌షాట్లు, లాఫ్టెడ్‌ షాట్ల ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే 13వ ఓవర్‌లో చాహల్‌ బౌలింగ్‌లో మాక్సీ వికెట్‌ కీపర్‌ రాహుల్‌ చేతికి చిక్కాడు. కానీ అది నోబాల్‌‌ కావడంలో భారత్‌కు నిరాశ తప్పలేదు. అనంతరం మాక్స్‌వెల్.. వేడ్‌తో కలిసి సిక్సర్ల మోత మోగించాడు. ఆయితే భారత్‌ ఆఖరి రెండు ఓవర్లలో వికెట్లు తీయడంతో ఆసీస్‌ స్కోరు 200 దాటలేదు. భారత బౌలర్లలో సుందర్‌ రెండు, శార్దూల్‌, నటరాజన్‌ తలో వికెట్ తీశారు.

ఇదీ చదవండి

హోరాహోరీగా మ్యాచ్‌ సాగిందిలా..

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts