IPL 2022 : వేలానికి 590 మంది

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 12, 13వ తేదీల్లో జరిగే వేలంలో ఉన్న క్రికెటర్ల తుది జాబితాను ఐపీఎల్‌ మంగళవారం ప్రకటించింది. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, అశ్విన్‌, కమిన్స్‌, డికాక్‌,  డుప్లెసిస్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రబాడ, షమి, వార్నర్‌, బౌల్ట్‌ ప్రాధాన్య ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు

Updated : 02 Feb 2022 07:12 IST

తుది జాబితా ప్రకటించిన ఐపీఎల్‌
ప్రాధాన్య ఆటగాళ్లుగా ధావన్‌ సహా పది మంది
దిల్లీ


ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 12, 13వ తేదీల్లో జరిగే వేలంలో ఉన్న క్రికెటర్ల తుది జాబితాను ఐపీఎల్‌ మంగళవారం ప్రకటించింది. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, అశ్విన్‌, కమిన్స్‌, డికాక్‌,  డుప్లెసిస్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రబాడ, షమి, వార్నర్‌, బౌల్ట్‌ ప్రాధాన్య ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. గత నెలలో విడుదల చేసిన జాబితాలో మొత్తం 1214 మంది క్రికెటర్లు ఉండగా.. ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా మరో 44 మందిని చేర్చారు. ఆ జాబితాను ఇప్పుడు 590కి కుదించారు. ఇందులో 355 మంది అంతర్జాతీయ అరంగేట్రం చేయని క్రికెటర్లు ఉన్నారు. వేలంలో మొత్తం 370 మంది భారత క్రికెటర్లు, 220 మంది విదేశీయులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రాధాన్య ఆటగాళ్లను (కనీస ధర రూ.2 కోట్లు) మొదట వేలం వేస్తారు.

రూ.2 కోట్ల కనీస ధరతో..: మొత్తం 48 మంది క్రికెటర్లు తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. వేలంలో ఇదే అత్యధిక కనీస ధర. భారత సీనియర్‌ ఆటగాళ్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, అజింక్య రహానె ఇందులో ఉన్నారు. ఇదే విభాగంలో ఉన్న ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు యువ   ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, పడిక్కల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, హర్షల్‌ పటేల్‌, చాహల్‌, శార్దూల్‌ ఠాకూర్‌ల కోసం వేలంలో ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడే అవకాశముంది. రెండు కోట్ల కనీస ధరతోనే ఉన్న బౌల్ట్‌, కమిన్స్‌, రబాడ, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, డుప్లెసిస్‌ల కోసం జట్లు కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. సురేశ్‌ రైనా, రాబిన్‌ ఉతప్ప  కూడా రూ.2 కోట్ల అత్యధిక కనీస ధరను పెట్టుకున్నారు కానీ వారికి అంతగా డిమాండ్‌ ఉండకపోవచ్చు.

వాళ్లు 20 మంది: తమ కనీస ధరను రూ.1.5 కోట్లు నిర్ణయించుకున్న ఆటగాళ్లు 20 మంది, కనీస ధరను రూ.1 కోటిగా పెట్టుకున్నవాళ్లు 34 మంది వేలానికి సిద్ధమవుతున్నారు. భారత అండర్‌-19 స్టార్లు యశ్‌ ధూల్‌, వికీ ఒస్త్వాల్‌, రవీంద్రన్‌ హంగార్గ్‌కర్‌తో పాటు యువ ఆటగాళ్లు షారుక్‌ ఖాన్‌, దీపక్‌ హుడా, అవేష్‌ ఖాన్‌ కూడా ఫ్రాంఛైజీలను   ఆకర్షిస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో మంచి ఫినిషర్‌గా షారుక్‌కు పేరుంది. ఈ తమిళనాడు బ్యాట్స్‌మన్‌ తన కనీస ధరను రూ. 20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచుకోగా.. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఒడియన్‌ స్మిత్‌ తన కనీస ధరను రూ.2 కోట్ల నుంచి రూ.1 కోటికి తగ్గించుకున్నాడు. నిషేధం తొలగిన ఫాస్ట్‌బౌలర్‌ శ్రీశాంత్‌ (కనీస ధర రూ.50 లక్షలు) కూడా వేలంలో ఉన్నాడు.

42 ఏళ్ల వయసులో..: దక్షిణాఫ్రికాకు చెందిన 42 ఏళ్ల స్పిన్నర్‌ తాహిర్‌ వేలంలో ఉన్న అతి పెద్ద వయస్కుడు. 17 ఏళ్ల నూర్‌ అహ్మద్‌ (అఫ్గాన్‌) అతి పిన్న వయస్కుడు. నూర్‌ అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడుతున్నాడు.
పంజాబ్‌ వద్ద ఎక్కువ డబ్బు: పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అత్యధికంగా 23వ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖర్చు చేయడానికి డబ్బులు కూడా ఆ ఫ్రాంఛైజీ దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. పంజాబ్‌ వద్ద రూ.72 కోట్లు ఉండగా.. అతి తక్కువగా దిల్లీ వద్ద రూ.47.5 కోట్లు ఉన్నాయి. చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి జట్లు తలో 21 స్థానాలు భర్తీ చేయాల్సివుంది. మిగతా ఫ్రాంఛైజీలు ఒక్కో దానికి 22 ఖాళీలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని