Updated : 26 Dec 2020 12:28 IST

కాంస్యమే.. కొండంత బలాన్నిచ్చింది  

ఒలింపిక్స్‌ దిశగా ఆత్మవిశ్వాసం పెరిగింది
‘ఈనాడు’తో బాక్సర్‌ హుసాముద్దీన్‌

జర్మనీలో ప్రపంచకప్‌ బాక్సింగ్‌ టోర్నీ.. పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్స్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గతేడాది ఆ టోర్నీలో స్వర్ణం నెగ్గిన ఆ బాక్సర్‌ మరోసారి ఫేవరేట్‌గా బరిలో దిగాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కానీ ప్రత్యర్థి విసిరిన ఓ పంచ్‌ తన ఎడమ కనురెప్ప మీద బలంగా తాకడంతో చర్మం చిట్లి రక్తం కారడం మొదలైంది. కొద్దిసేపటికే కన్ను వాచి.. చూపు కొద్దిగా కష్టమైంది. అయినప్పటికీ అతను పోరాటం ఆపలేదు. ప్రత్యర్థిని 5-0తో చిత్తు చేశాడు. ఆ బౌట్‌ తర్వాత తన గాయానికి కుట్లు వేశారు. కానీ సెమీస్‌లో గాయం తీవ్రత ఎక్కువ కావడంతో పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేక కాంస్యానికే పరిమితమయ్యాడు. అతను గెలిచింది కంచు పతకమే కావొచ్చు కానీ టోర్నీలో తన తెగువతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ బాక్సర్‌ ఎవరో కాదు.. మన తెలంగాణ కుర్రాడు మహమ్మద్‌ హుసాముద్దీన్‌. ఒలింపిక్స్‌ దిశగా సాగుతున్న తనకు ఇటీవల గెలిచిన ఈ కాంస్యం కొండంత బలాన్నిచ్చిందని ‘ఈనాడు’తో చెప్పాడు. అతను ఇంకా ఏమన్నాడంటే..

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌

ప్రపంచకప్‌ బాక్సింగ్‌ టోర్నీలో కాంస్యానికే పరిమితమైనప్పటికీ ఆ పతకం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా సాగుతున్న నాకు ఓ ప్రేరణనిచ్చింది. ఎందుకంటే నేను చివరగా టోర్నీలో పాల్గొంది ఫిబ్రవరిలో. ఆ తర్వాత లాక్‌డౌన్‌ వల్ల ఆటలన్నీ ఆగిపోయాయి. బాక్సర్లందరిలాగే నేనూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం పరిస్థితులు మెరుగు పడుతుండడంతో సాయ్‌ నిర్వహించిన శిక్షణ శిబిరానికి హాజరయ్యా. ఆ తర్వాత ఐరోపాలో శిక్షణ కోసం భారత బృందంతో కలిసి వెళ్లా. అక్కడ అంతర్జాతీయ బాక్సర్లతో కలిసి సాధన చేయడం ఎంతో ఉపయోగపడింది. తిరిగి ఫిట్‌నెస్‌ సాధించా. ఆటతీరును మార్చుకున్నా. రింగ్‌లో ఒకచోట కుదరుగా నిలబడి పంచ్‌లు విసరగలుగుతున్నా. టెక్నిక్‌ మెరుగైంది. అయినప్పటికీ దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత తొలిసారిగా బరిలో దిగడంతో ఆ ప్రపంచకప్‌ టోర్నీకి ముందు కాస్త ఒత్తిడి ఎదుర్కొన్నా. ఇన్ని రోజులు సాధన చేసినప్పటికీ.. పోటీలకు దూరంగా ఉన్నా కాబట్టి రింగ్‌లో అడుగుపెట్టాక ఎలా స్పందిస్తానో అని సందేహించా. కానీ తొలి బౌట్‌లో విజయంతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. మునుపటి జోరును ప్రదర్శించా. 

ఆపాలనుకోలేదు..
క్వార్టర్స్‌లో జర్మనీ బాక్సర్‌ ఉమర్‌ బజ్వాతో పోరులో కనుబొమ్మకు గాయమైనప్పటికీ బౌట్‌ నుంచి మధ్యలో తప్పుకోవాలని అనుకోలేదు. ఏది ఏమైనా విజయం సాధించాలని అప్పుడు నా మనసులో ఉంది. అందుకే రక్తం కారినప్పటికీ ఆట ఆపలేదు. గతంలో ఒకసారి అదే చోట గాయమైంది. తర్వాత దాన్నుంచి కోలుకున్నా. మళ్లీ ఇప్పుడు కూడా అక్కడే దెబ్బ తగిలింది. అయినా ప్రత్యర్థికి తలవంచాలని భావించలేదు. అందుకే గాయమైనా రెట్టించిన ఉత్సాహంతో పంచ్‌లు విసిరా. ప్రత్యర్థికి ఒక్క పాయింట్‌ కూడా దక్కకుండా మ్యాచ్‌ ముగించా. అయితే బౌట్‌ తర్వాత గాయానికి కుట్లు వేశారు. దీంతో సెమీస్‌లో పాల్గొనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది. కానీ వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ దిశగా సాగుతున్న నాకు మంచి ప్రాక్టీస్‌ కావాలంటే బౌట్‌లో పాల్గొనాల్సిందేనని నిర్ణయించుకున్నా. కానీ గాయం బాధిస్తుండడంతో రింగ్‌లో వంద శాతం ప్రదర్శన ఇవ్వలేకపోయా. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటమి వైపు నిలవాల్సి వచ్చింది. ఈ టోర్నీ ప్రతి ఏడాది జరగుతుంది. తక్కువ దేశాలే పాల్గొన్నప్పటికీ పోటీ తీవ్రత మాత్రం బాగానే ఉంటుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో పాల్గొనడంతో నాకు మేలు జరిగిందనే అనుకుంటున్నా. 

ఆ దిశగా..

టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్నదే నా కల. గత ఒలింపిక్స్‌ (2016 రియో) సమయంలో వెన్నునొప్పితో అర్హత టోర్నీలకు దూరమయ్యా. కానీ ఈ సారి మాత్రం అవకాశం వదిలేది లేదు. ప్రస్తుతం నిజామాబాద్‌లోనే ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నా. ఇంకా గాయానికి వేసిన కుట్లు విప్పలేదు. దాని నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరులో జాతీయ శిబిరంలో పాల్గొంటా. ఆ తర్వాత బల్గేరియాతో పాటు కొన్ని టోర్నీలు ఆడాల్సి ఉంది. ఒలింపిక్స్‌ అర్హత టోర్నీ జూన్‌లో ఉంది. ఆ లోపు వీలైనన్ని ఎక్కువ టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించి మరింత మెరుగ్గా సన్నద్ధమవాలి. జర్మనీ ప్రపంచకప్‌ టోర్నీలో భారత బాక్సర్లు గొప్పగా రాణించారు. మూడు స్వర్ణాలు సహా మొత్తం తొమ్మిది పతకాలు సాధించాం. ఈ టోర్నీ చరిత్రలో భారత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఒలింపిక్స్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తాం. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని