చెన్నై అభిమానులకు చేదువార్త!

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గాయంతో ఆఖరి ఓవర్‌ వేయలేకపోయిన చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో.. కోలుకోవడానికి కొన్ని రోజుల నుంచి వారాల సమయం పడుతుందని ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ తెలిపాడు...

Published : 19 Oct 2020 02:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గాయంతో ఆఖరి ఓవర్‌ వేయలేకపోయిన చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో.. కోలుకోవడానికి కొన్ని రోజుల నుంచి వారాల సమయం పడుతుందని ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ తెలిపాడు. శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బ్రావో అస్వస్థతతో మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. దీంతో ఆఖరి ఓవర్‌లో స్పిన్నర్‌ జడేజాతో బౌలింగ్‌ చేయించగా చెన్నై పరాజయాన్ని చవిచూసింది. అయితే బ్రావోకి గజ్జల్లో గాయమైందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్‌ అన్నాడు.

‘‘డెత్‌ బౌలర్‌ అయిన బ్రావోకి దురదృష్టవశాత్తు గాయం కావడంతో ఆఖరి ఓవర్‌ వేయలేకపోయాడు. ఇలాంటి సవాళ్లతో మా సీజన్‌ కొనసాగుతోంది. అయితే చివరి ఓవర్‌లో జడేజాతో బౌలింగ్‌ చేయించాలని మా ప్రణాళికలో లేదు. మాకు మరో అవకాశం లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం. మేం బాగానే ప్రయత్నించాం. మరింత కష్టపడాల్సి ఉంది. కాగా, బ్రావోకి కుడి కాలి గజ్జలో గాయమైంది. దాని తీవ్రత చూస్తే ఇప్పట్లో  మైదానంలో అడుగు పెట్టేలాలేడు. అయితే ఆఖర్లో బౌలింగ్‌ చేయలేకపోయినందుకు అతడు ఎంతో బాధపడ్డాడు. జట్టు కోసం ఎంతో పరితపిస్తున్నాడు. గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు లేదా వారాల సమయం పడుతుంది’’ అని స్టీఫెన్‌ పేర్కొన్నాడు. మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న చెన్నై ప్లేఆఫ్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లు ఎంతో కీలకం. జట్టులో సీనియర్‌ ఆటగాడైన బ్రావో కీలక మ్యాచ్‌లకు దూరమవ్వడం ఆ జట్టుకు ప్రతికూలాంశమే.

చెన్నై నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. అజేయ శతకంతో చెలరేగి దిల్లీని గెలిపించిన ధావన్‌ను ఫ్లెమింగ్‌ కొనియాడాడు. ‘‘క్యాచ్‌లు జారవిడిచి ధావన్‌కు అవకాశాలు ఇచ్చాం. ఆదిలోనే ఔట్‌ చేసే అవకాశమొచ్చినా మేం సద్వినియోగం చేసుకోలేకపోయాం. అయితే ధావన్‌ గొప్పగా ఆడాడు. దూకుడుగా ఆడుతూ కావాల్సిన రన్‌రేట్‌ను నియంత్రణలో ఉంచాడు. అతడిని ఔట్‌ చేసి ఉంటే మిడిలార్డర్‌పై ఒత్తిడి తెచ్చేవాళ్లం. కానీ మూడు, నాలుగు క్యాచ్‌లు అందుకోలేకపోవడం వల్ల మ్యాచ్‌ పరిస్థితి మారిపోయింది’’ అని అన్నాడు. ఏడు విజయాలతో దిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని