ధోనీయే పట్టుబట్టి మరీ ఒప్పించాడు.. 

ఐపీఎల్‌ చరిత్రలోనే ఈ పదమూడో సీజన్‌ కాస్త ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కరోనా పరిస్థితుల కారణంగా దాదాపు ఆరు నెలలు వాయిదా పడింది...

Published : 27 Aug 2020 11:01 IST

సీఎస్కే సీఈవో విశ్వనాథన్‌ ఏమన్నాడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ చరిత్రలోనే ఈ పదమూడో సీజన్‌ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కరోనా పరిస్థితుల కారణంగా దాదాపు ఆరు నెలలు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ మెగా టోర్నీని భారత్‌లో నిర్వహించడం కష్టతరమైన నేపథ్యంలో యూఏఈకి తరలించారు. ఈ క్రమంలోనే అన్ని జట్లూ అక్కడికి వెళ్లి క్వారెంటైన్‌ సమయాన్ని పూర్తి చేసుకొంటున్నాయి. అది పూర్తయితే గానీ క్రికెటర్లు సాధనలో పాల్గొనలేరు. అలాంటిది చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాత్రం అందరికన్నా ముందే ముందడుగు వేసింది. మార్చిలో లాక్‌డౌన్‌ విధించకముందు ఎలాగైతే  ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించిందో.. అలాగే ఇప్పుడూ దుబాయ్‌కు వెళ్లేముందు మరోసారి ప్రత్యేక ఫిట్‌నెస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసింది. దీంతో అన్ని జట్ల కన్నా ముందే సీఎస్కే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై దృష్టిసారించారు. ఈ నిర్ణయానికి కారణం కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీయే అని ఆ జట్టు సీఈవో విశ్వనాథన్‌ వెల్లడించారు.

తమ ఫిట్‌నెస్‌ క్యాంప్‌నకు సంబంధించి ఆ జట్టు సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పంచుకొంది. దానిలో దీపక్‌ చాహర్‌, అంబటి రాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగానే విశ్వనాథన్‌ స్పందించారు. తాము ఆ శిబిరం ఎందుకు నిర్వహించామో వివరించారు. తొలుత చాహర్‌ మాట్లాడుతూ.. ‘ప్రతీ ఆటగాడు 5 నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పుడంతా ఒక్కటే. రాబోయే ఐపీఎల్‌లో మేం కాస్త మెరుగ్గా ఉంటామని భావిస్తున్నా. ఎందుకంటే మాకు ఈ ఫిట్‌నెస్‌ క్యాంప్‌ అనుభవం పనికొస్తుంది’ అని చెప్పాడు. అనంతరం అంబటి రాయుడు మాట్లాడుతూ..కరోనాతో 5 నెలలు ఆటకు దూరమయ్యామని, ఈ శిబిరం ఆటగాళ్లందరికీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు. దీంతో వాళ్లంతా శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతారని వివరించాడు.

చివరగా విశ్వనాథన్‌ స్పందిస్తూ.. ఐపీఎల్‌ జరుగుతుందని తెలిశాక తాను ధోనీతో మాట్లాడనని అప్పుడతడు మళ్లీ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలని తనతో చెప్పాడన్నాడు. ‘అందు కోసం ప్రత్యేక అనుమతులు పొందాలి. బయో బబుల్‌ నిర్మించాలి. ఆ విషయంపై నేను సంశయించి అతడిని సంప్రదించాను. దుబాయ్‌కు వెళ్లేముందు ఐదు రోజులు అవసరమా అని అడిగాను. అయితే, ఆ విషయంలో ధోనీ చాలా సానుకూలంగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడు. నాలుగైదు నెలలుగా ఆటగాళ్లెవరూ క్రికెట్‌ ఆడలేదని. దాంతో కచ్చితంగా ఇది అవసరమని వెల్లడించాడు. చెన్నైలోనే బయో బబుల్‌ వాతావరణం సృష్టిస్తే అది దుబాయ్‌కు వెళ్లాక ఉపయోగపడుతుందని చెప్పాడు’ అని విశ్వనాథన్‌ పేర్కొన్నాడు. మరోవైపు గత శుక్రవారం చెన్నై నుంచి దుబాయ్‌కు చేరుకున్న ఆ జట్టు నేటితో క్వారెంటైన్‌ గడువును పూర్తి చేసుకోనుంది. దీంతో రేపటి నుంచి కఠిన సాధన‌ ప్రారంభంకానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని