ఆ రెండూ సీఎస్‌కే బలం

సీనియర్‌ క్రికెటర్లైన సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ లేకపోవడం కచ్చితంగా లోటేనని చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు షేన్‌వాట్సన్‌ అన్నాడు. అయితే జట్టుకు భీకరమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌ ఉందని పేర్కొన్నాడు. అనుభవం, నాణ్యత అనే రెండు ఆయుధాలు సీఎస్‌కే సొంతమని ధీమా వ్యక్తం చేశాడు....

Published : 11 Sep 2020 01:41 IST

రైనా, భజ్జీ లేకపోవడం లోటే: వాట్సన్‌

(BCCI Image)

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియర్‌ క్రికెటర్లైన సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ లేకపోవడం కచ్చితంగా లోటేనని చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు షేన్‌వాట్సన్‌ అన్నాడు. అయితే జట్టుకు భీకరమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌ ఉందని పేర్కొన్నాడు. అనుభవం, నాణ్యత అనే రెండు ఆయుధాలు సీఎస్‌కే సొంతమని ధీమా వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్‌ షోలో అతడు మాట్లాడాడు.

గతేడాది రన్నరప్‌గా నిలిచిన చెన్నై ఈ సారి ఎన్నో ఆశలతో దుబాయ్‌లో అడుగుపెట్టింది. ఆ శిబిరంలో దీపక్‌ చాహర్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సహా 13 మందికి కొవిడ్‌-19 సోకడంతో కలవరం మొదలైంది. అదే సమయంలో సీనియర్‌ ఆటగాడు రైనా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేశాడు. భారత్‌లోనే ఉన్న హర్భజన్‌ సైతం జట్టుకు అందుబాటులో ఉండనని ప్రకటించేశాడు. కరోనా కారణంగా ఆ జట్టు ఆలస్యంగా సాధన మొదలుపెట్టింది. సెప్టెంబర్‌ 19న ముంబయి తొలి పోరుకు సిద్ధమవ్వడం కష్టంగానే అనిపిస్తోంది.

‘అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారంటే ఒత్తిడిలోనూ నైపుణ్యాలను ప్రదర్శించగలరని అర్థం. అందుకే ఈ ఏడాది ఐపీఎల్‌ మాకు గొప్పగా సాగుతుందనే అనిపిస్తోంది. ఎందుకంటే మాకు అనుభవం, నాణ్యత రెండూ ఉన్నాయి. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెటర్‌ రైనా. పరుగుల వీరుల్లో రెండో స్థానం. ఎడారి, పొడి వాతవరణం, స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై అతడు చెలరేగుతాడు. రెండేళ్లుగా భజ్జీ కీలకంగా ఉంటున్నాడు. వారిద్దరూ లేకపోవడం కచ్చితంగా లోటే’ అని వాట్సన్‌ అన్నాడు.

‘నాలుగేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌ లీగులు ఆడుతున్నాను. సవాళ్లు విసిరే పరిస్థితుల్లో నైపుణ్యాలను ఎలా ప్రదర్శించాలో నాకిప్పుడు అర్థమైంది. 2018లో ఫైనల్లోనే కాకుండా టోర్నీ సాంతం బాగా ఆడాను. 2019లో అంత బాగా ఆడలేదు. అయినప్పటికీ సీఎస్‌కేలోని గొప్ప నాయకత్వ బృందం నాకు అండగా నిలిచింది. వరుసగా అవకాశాలు ఇచ్చింది. నాపై ఆత్మవిశ్వాసం ఉంచింది. అదే వేరే జట్టైతే పక్కన కూర్చోబెట్టేది. సీనియర్‌ ఆటగాడు మురళీ విజయ్‌ అద్భుతమైన బ్యాట్స్‌మన్‌. గతేడాది ఎక్కువగా బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఈ సారి ఎక్కువ మ్యాచుల్లో ఆడేందుకు అవకాశం ఉంది’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని