షాక్‌! క్రికెట్‌కు కోరె అండర్సన్‌ వీడ్కోలు

29 ఏళ్లకే న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కోరె అండర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కివీస్ తరఫున ఆడటం ఎంతో గర్వంగా ఉందని, రిటైర్మెంట్‌పై లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాని

Published : 06 Dec 2020 03:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 29 ఏళ్లకే న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కోరె అండర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కివీస్ తరఫున ఆడటం ఎంతో గర్వంగా ఉందని, రిటైర్మెంట్‌పై సుదీర్ఘంగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాని అతడు‌ తెలిపాడు. 2014లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో అండర్సన్ 36 బంతుల్లోనే శతకం సాధించి క్రికెట్‌ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించాడు. వన్డేల్లో వేగవంతమైన శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కాగా, ఆ రికార్డును దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ (31 బంతుల్లో) బద్దలు కొట్టాడు. అయితే అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్‌లో తన ఆటను కొనసాగిస్తున్నట్లు అండర్సన్‌ తెలిపాడు. ఈ టీ20 లీగ్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు.

‘‘న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. రిటైర్మెంట్ అంత సులువైన నిర్ణయం కాదు. నాలో నేను ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాను. వచ్చే అయిదు-పదేళ్లలో ఏం సాధించాలో ఆలోచించాను. వయసు పెరిగేకొద్ది ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. కష్టకాలంలో నా కాబోయే భార్య మేరీ మార్గరెట్‌ నాకెంతో అండగా నిలిచింది. నా కోసం తన స్వస్థలం అమెరికా నుంచి కివీస్‌కు వచ్చింది. గాయాల బారిన పడినప్పుడు, ఇతర విషయాల్లో మద్దుతుగా ఉంది. రిటైర్మెంట్ అనంతరం ఆమెతో కలిసి అమెరికాలో ఉండాలనుకుంటున్నా’’ అని అండర్సన్ తెలిపాడు. న్యూజిలాండ్‌ తరఫున అతడు 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 2,277 పరుగులు, 90 వికెట్లు సాధించాడు. చివరగా 2018, నవంబర్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు