భారత్‌తో టెస్టు సిరీస్‌ బయోసెక్యూర్‌ విధానం? 

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో ఆడే టెస్టు సిరీస్‌ను బయో సెక్యూర్‌ విధానంలో నిర్వహించడమే తమ తొలి ప్రధాన్యమని క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో నిక్‌హాక్లే పేర్కొన్నాడు...

Published : 21 Jul 2020 21:31 IST

అన్ని ఏర్పాట్లు చేస్తాం: ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో ఆడే టెస్టు సిరీస్‌ను బయో సెక్యూర్‌ విధానంలో నిర్వహించడమే తమ తొలి ప్రాధాన్యమని క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో నిక్‌హాక్లే పేర్కొన్నాడు. 2020 టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ సోమవారం వాయిదా వేయగా ఆ బోర్డు ఆ నిర్ణయాన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో నిక్‌హాక్లే మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్‌లో టీమ్‌ఇండియాతో నిర్వహించే టెస్టు సిరీస్‌పై స్పందించాడు. ఆ సిరీస్‌ను తమ బోర్డు బయోసెక్యూర్‌ విధానంలో నిర్వహించాలని చూస్తోందని, ఆటగాళ్ల భద్రత కోసం మైదానాల వద్దే హోటల్‌ వసతి కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాడు. 

మరోవైపు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టే భారత జట్టు క్వారెంటైన్‌ కేంద్రాల్లో ఉండాల్సిందేనన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల రీత్యా తమ దేశంలో అడుగుపెట్టే ఎవరైనా విధిగా 14 రోజులు క్వారెంటైన్‌లో ఉండాలని, అవి ప్రభుత్వం నిర్ణయాలని హాక్లే అన్నాడు. అయితే, భారత్‌.. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే నాటికి ఈ ఆంక్షలు ఎత్తేసే అవకాశాలున్నట్లు ఆయన అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు అక్కడికి రాగానే మొదట పరీక్షలు నిర్వహిస్తారని, ఆ తర్వాత ప్రభుత్వ, వైద్య ఆరోగ్య నిపుణుల మార్గదర్శకాల అనుగుణంగా వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నాడు. క్వారెంటైన్‌ కేంద్రాల వద్ద క్రికెటర్లు అన్ని విధాలా ప్రాక్టీస్‌ చేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తామన్నాడు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌ను గమనిస్తున్నామని, వారిలాగే బయోసెక్యూర్‌ విధానంలో ఈ సిరీస్‌ను నిర్వహించాలని చూస్తున్నట్లు హాక్లే వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని