Updated : 05 Dec 2020 10:40 IST

జడేజా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌పై రచ్చ? 

మాజీ క్రికెటర్ల భిన్నాభిప్రాయాలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా రవీంద్ర జడేజాకు బదులు స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడంపై క్రికెట్‌ వర్గాల్లో వివాదం నెలకొంది. కంకషన్‌ నిబంధనలకు కట్టుబడే భారత్‌ వ్యవహరించిందని పలువురు మాజీలు పేర్కొంటుండగా.. పలువురు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆఖర్లో జడేజా (44నాటౌట్‌; 23 బంతుల్లో 5x4, 1x6) మెరుపు బ్యాటింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే అతడి హెల్మెట్‌కు బంతి తాకి గాయానికి గురయ్యాడు. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో ఆడలేదు. తొలి ఇన్నింగ్స్‌ తర్వాత బీసీసీఐ వైద్య బృందం జడేజాను పరిశీలించి మిగిలిన ఆటలో పాల్గొనలేడని స్పష్టం చేయడంతో టీమ్‌ఇండియా మ్యాచ్‌ రిఫరీకి విషయం తెలియజేసింది. వెంటనే చాహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే చాహల్‌ తన బౌలింగ్‌తో మాయచేసి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. 3/25 ప్రదర్శనతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. అయితే, మ్యాచ్‌ జరుగుతుండగానే చాహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడంపై ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌తో వాగ్వాదానికి దిగాడు. 

కంకషన్‌ నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఆటగాడికి ఆట మధ్యలో తలకు గాయమైతే అతడికి బదులో మరో ఆటగాడిని తీసుకునే వీలుంది. అయితే, అలా కంకషన్‌గా వచ్చే ఆటగాడు గాయపడిన ఆటగాడి కోవకే చెందాల్సి ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్‌. చాహల్‌ స్పెషలిస్టు స్పిన్నర్‌. దీంతో ఇద్దరి మధ్యా వృత్యాసం ఉందనేది ఆస్ట్రేలియా అభ్యంతరం. ఈ నేపథ్యంలోనే పలువురు మాజీలు ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు.

ఎవరేమన్నారంటే..
* ఈ మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ ఆస్ట్రేలియన్‌. అతడా జట్టుకు మాజీ ఆటగాడు కూడా. జడేజాకు బదులు చాహల్‌ సబ్‌స్టిట్యూట్‌గా రావడాన్ని ఆయన స్వాగతించారు. ఇక చాహల్‌ స్పెషలిస్టు స్పిన్నర్‌ అని వాదించొచ్చు కానీ.. జడేజా సైతం బౌలింగ్ చేయగలడు కాబట్టి చాహల్‌ను తీసుకోవడం సరైందే. మ్యాచ్‌ రిఫరీ కూడా దాన్ని అంగీకరించాక దాంట్లో తప్పుపట్టాల్సిన అవసరం లేదు.   -సునీల్‌ గావస్కర్‌

* కంకషన్‌ నిబంధనలకు లోబడే టీమ్‌ఇండియా ఆడింది. నిబంధనల ప్రకారం ఆడితే అది కచ్చితంగా ఆమోదించాల్సిన విషయమే -ప్రజ్ఞాన్‌ ఓజా

* జడేజా స్థానంలో చాహల్‌ సబ్‌స్టిట్యూట్‌గా రావడంపై నాకెలాంటి అభ్యంతరం లేదు. కాని జడేజా హెల్మెట్‌కు బంతి తగిలినప్పుడు వైద్యుడు, ఫిజియో మైదానంలోకి రాకపోవడం నిబంధనల్ని పాటించినట్లే అవుతుందా?  -టామ్‌ మూడీ.

* జడేజాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అవసరమనడానికి వైద్యుడు లేదా ఫిజయో మైదానంలో అతడిని పరీక్షించలేదు. అంతకుముందు జడేజా కాలికి సంబంధించి ఏదో చేయించుకున్నట్లు కనిపించింది. ఇన్నింగ్స్‌ అనంతరం కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను బరిలో దించారు.   -మైఖేల్‌ వాన్‌

* జడేజా తలకు బంతి తగిలిన సమయంలో ఫిజియో రాకపోవడం నిబంధనలకు విరుద్ధం. వైద్యులు అక్కడికి చేరుకొని బ్యాట్స్‌మన్‌ను పరిశీలించాలి. అతడికి ఎలా ఉందనే విషయాలు తెలుసుకోవాలి. కానీ జడేజా విషయంలో ఇదేం జరగలేదు. కాసేపట్లోనే అతడు తిరిగి బ్యాటింగ్‌ చేశాడు. ఒకవేళ వైద్యులు అతడిని పరిశీలించి ఉంటే టీమ్‌ఇండియాకు బాగుండేది. మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌.. చాహల్‌ను అంగీకరించక తప్పలేదు.   -సంజయ్‌ మంజ్రేకర్‌

* తలకు గాయమైతే లక్షణాలు వెంటనే కనిపించవు. 24 గంటల తర్వాత కూడా దాని ప్రభావం ఉండొచ్చు. జడేజా డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లాక తలపై వాపు కనిపించిందేమో. ఇంతకుముందు స్మిత్‌ తలకు బౌన్సర్‌ తాకితే.. అతడి స్థానంలో ఆస్ట్రేలియా లబుషేన్‌ను ఆడించింది.  -వీరేంద్ర సెహ్వాగ్‌

ఇవీ చదవండి..

నాటి ఆసీస్‌ లాభం.. కోహ్లీసేనతో నష్టమైందా?

ఒక్కడు ఇద్దరై..

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని