రఫేల్‌కు జై.. జై అన్న ధోనీ

శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే రఫేల్‌ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో అధికారికంగా చేరినందుకు టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ కొనియాడాడు. వీటి చేరికతో వాయుసేన శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నాడు. భీకరంగా పోరాడే అత్యుత్తమ ఫైటర్‌ జెట్‌ ఫైలట్లు వీటిని...

Updated : 10 Sep 2020 21:27 IST

భారత వాయుసేనకు అభినందనలు

దుబాయ్‌: శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే రఫేల్‌ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో అధికారికంగా చేరినందుకు టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ కొనియాడాడు. వీటి చేరికతో వాయుసేన శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నాడు. భీకరంగా పోరాడే అత్యుత్తమ ఫైటర్‌ జెట్‌ ఫైలట్లు వీటిని నడుపుతారని వెల్లడించాడు. ఈ మేరకు అతడు వరుస ట్వీట్లు చేశాడు.

ఆట పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ భారత సైన్యానికి సంబంధించిన అంశాల్లో ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. ఎందుకంటే అతడు టెరిటోరియల్‌ ఆర్మీలో గౌరవ లెఫ్టి‌నెంట్‌ కర్నల్‌ హోదాలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఏటా సరిహద్దుల్లోకి వెళ్లి విధులు నిర్వర్తిస్తుంటాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత మహీ రెండు నెలలు సైన్యంలో పనిచేశాడు. గతంలో పద్మభూషణ్‌ పురస్కారాన్ని సైతం సైనిక దుస్తుల్లోనే అందుకున్నాడు.

‘పోరాటాల్లో అత్యుత్తమ పరాక్రమాన్ని ఘనంగా చాటుకున్న 4.5 తరం యుద్ధ విమానాలను గొప్ప పైలట్లు నడుపుతారు. ఈ లోహ విహంగాలు మిగతా యుద్ధవిమానాలతో కలిసి భారత వాయుసేన సామర్థ్యాన్ని మరింత పరాక్రమంగా, పటిష్ఠంగా మారుస్తాయి. 17వ స్క్వాడ్రన్‌ (గోల్డెన్‌ యారోస్‌)కు అభినందనలు. మిరాజ్‌-2000 సేవా రికార్డులను రఫేల్‌ బద్దలు కొడతాయనే అనుకుంటున్నాను. అయితే సుఖోయ్‌ 30ఎంకేఐ మాత్రం ఎప్పటికీ నాకిష్టం. ఇవి సూపర్‌ సుఖోయ్‌గా ఉన్నతీకరణ చెందాలి’ అని ధోనీ ట్వీట్‌ చేశాడు. మరో క్రికెటర్‌ మనోజ్‌ తివారీ సైతం వాయుసేనకు అభినందనలు తెలియజేశాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని