Updated : 24 Nov 2020 13:58 IST

టెన్నిస్‌ కోసం చదువునే వదిలేశాడు..

ఏటీపీ ప్రపంచ టూర్‌ విజేత డానియల్‌ మెద్వెదెవ్‌

డానియల్‌ మెద్వెదెవ్‌.. టెన్నిస్‌లో నాలుగో నంబర్‌ ఆటగాడు. ఆదివారం ఏటీపీ టూర్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి శెభాష్‌ అనిపించుకున్నాడు. రష్యాకు చెందిన ఈ 24 ఏళ్ల యువకుడు ఆటపై ఇష్టంతో చదువును మధ్యలోనే వదిలేశాడు. అప్లైడ్‌ ఎకనామిక్స్‌, కామర్స్‌ డిగ్రీని పక్కనపెట్టి మళ్లీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో చేరాడు. అలా కోచ్‌గా డిప్లొమా సర్టిఫికేట్‌ అందుకున్న మెద్వెదెవ్‌.. ఇప్పుడు ఏటీపీ ప్రపంచ టూర్‌లో ముగ్గురు దిగ్గజాలను ఓడించాడు. జకోవిచ్‌, నాదల్‌, డొమినిక్‌ థీమ్‌లను మట్టికరిపించి టెన్నిస్‌ యువ సంచలనంగా మారాడు. అసలీ మెద్వెదెవ్‌ ఎవరు?.. అతడి నేపథ్యం ఏంటో తెలుసుకుందాం..

జాతివివక్ష వ్యాఖ్యలతో నిషేధం..
మెద్వెదెవ్‌ 2015లో ఏటీపీ డబుల్స్‌ విభాగంలో తొలిసారి అడుగుపెట్టగా.. మరుసటి ఏడాది సింగిల్స్‌లో అరంగేట్రం చేశాడు. అలా 2016 రికో ఓపెన్‌లో అర్జెంటీనా ఆటగాడు హోరాసియోను ఓడించి ఏటీపీ టూర్‌లో తొలి విజయం సాధించాడు. ఆపై అమెరికాలోని జార్జియాలో జరిగిన సెవాన్నా ఛాలెంజర్‌ ఈవెంట్‌లో ఛైర్‌ అంపైర్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన మెద్వెదెవ్‌ ఆట మధ్యలోనే నిషేధానికి గురయ్యాడు. ఆ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి డొనాల్డ్‌ యంగ్‌పై ఒక బ్రేక్‌ పాయింట్‌ సాధించేవాడినని, అంపైర్‌ తప్పిదం వల్లే అది కోల్పోయానని వాపోయాడు. ఈ సందర్భంగా తన ప్రత్యర్థికి ఆ అంపైర్‌ స్నేహితురాలని పేర్కొనడమే కాకుండా జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిని రెండో రౌండ్‌ నుంచే తొలగించారు.

తొలి గ్రాండ్‌స్లామ్‌ గెలిచే అవకాశమున్నా..
2017లో భారత్‌లో నిర్వహించిన చెన్నై ఓపెన్‌లో ఈ రష్యా ఆటగాడు ఫైనల్స్‌కు చేరినా.. రాబర్టో బాటిస్టా అనే స్పెయిన్‌ ఆటగాడితో రెండు సెట్లలో ఓటమిపాలయ్యాడు. అయితే, ఆ ఈవెంట్‌లో మంచి ప్రదర్శన చేయడంతో తన ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు. 99 నుంచి ఏకంగా 65కు చేరుకున్నాడు. అనంతరం పలు ఈవెంట్లలో ఇంకా బాగా రాణించి అదే ఏడాది వింబుల్డన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. కానీ, మెద్వెదెవ్‌ ఇక్కడ కూడా అంపైర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. తొలిరౌండ్‌లో స్టాన్‌ వావ్రింకా అనే మూడో నంబర్‌ ఆటగాడిని ఓడించగా తర్వాతి రౌండ్‌లో రూబెన్‌ బెమెల్మాన్స్‌ చేతిలో కంగుతిన్నాడు. ఆ సమయంలో అంపైర్‌తో తప్పుగా ప్రవర్తించడంతో భారీ జరిమానాకు గురయ్యాడు. దాంతో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించే సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు. 

కెరీర్ సాగిన తీరు..
ఇక మెద్వెదెవ్‌ కెరీర్‌ గత మూడేళ్లుగా ఘనంగా సాగుతోంది. 2018, 19, 20 సీజన్లలో తన ఆటకు మరింత పదును పెట్టిన అతడు.. వరుస విజయాలతో దూసుకెళ్లాడు. తొలుత 2018లో సిడ్నీ ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరి,, తర్వాత విన్‌స్టన్‌ సాలెమ్‌ ఓపెన్‌లో రెండోసారి ఏటీపీ టైటిల్‌ సాధించాడు. ఆపై టోక్యో ఓపెన్‌లో మూడోసారి విజేతగా నిలిచాడు. 2019లో ఏటీపీ మాస్టర్స్ షాంఘై, సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ ఓపెన్‌, ఏటీపీ మాస్టర్స్‌ సిన్సినట్టి, సోఫియా ఈవెంట్లలో వరుసగా కదం తొక్కాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్లో డొమినిక్‌ థీమ్‌ చేతిలో ఓటమిపాలై  విఫలమయ్యాడు. కరోనా విరామం తర్వాత ఫామ్‌ కోల్పోయి సతమతమయ్యాడు. అక్టోబర్‌లో పారిస్‌ మాస్టర్స్‌లో విజయం సాధించిన మెద్వెదెవ్‌ ఇప్పుడు ఏటీపీ ప్రపంచ టూర్‌లో విజేతగా నిలిచాడు.

ఆ రికార్డు సృష్టించిన నాలుగో ఆటగాడు..
ఆదివారం జరిగిన ఏటీపీ టూర్‌ ఫైనల్స్‌లో మెద్వెదెవ్‌ ఆస్ట్రియన్‌ ఆటగాడు, ప్రపంచ నంబర్‌ 3 ప్లేయర్‌ డొమినిక్‌ థీమ్‌ను ఓడించాడు. 4-6, 7-6(2), 6-4 తేడాతో తొలి సెట్‌లో వెనుకపడ్డా అనూహ్యంగా రెండో సెట్‌లో దూసుకొచ్చాడు. అలాగే మూడో సెట్‌లోనూ ఆధిపత్యం చెలాయించి ఆస్ట్రేలియా ఓపెన్‌కు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విజయంతో మెద్వెదెవ్‌ టెన్నిస్‌ యువ సంచలనంగా మారడంతో పాటు 2007 తర్వాత తొలిసారి ఒకే ఈవెంట్‌లో ముగ్గురు టాప్‌ ఆటగాళ్లను ఓడించిన రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. 

ఇంతకుముందు ఈ రికార్డు నెలకొల్పిన ఆటగాళ్లు..
2007లో నల్బాడియన్‌ మాడ్రిడ్‌ మాస్టర్స్‌ ఈవెంట్‌లో ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌ను ఓడించాడు.
అదే 2007లోనే జకోవిచ్‌ కెనడా మాస్టర్స్‌ ఈవెంట్‌లో ఫెదరర్‌, నాదల్‌, రాడిక్‌ను ఓడించాడు. 
అంతకుముందు 1994లో బెకర్‌ స్టాక్‌హోమ్‌ ఈవెంట్స్‌లో సాంప్రాస్‌, ఇవానిసెవిక్‌, స్టిచ్‌ను ఓడించాడు. 
తాజాగా ఏటీపీ టూర్‌లో మెద్వెదెవ్‌.. జకోవిచ్‌, నాదల్‌, డొమినిక్‌ థీమ్‌ను ఓడించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని