నా ఒక్కడి విషయంలోనే జీరో టాలరెన్సా?

‘నా ఒక్కడి విషయంలోనే జీరో టాలరెన్స్‌, ఇతరుల మీద కాదు. జీవితకాల నిషేధం నా మీదే కానీ వేరేవాళ్లకు కాదు. కులం, మతం, వర్ణం, నేపథ్యం లాంటి విషయాలను బట్టి చట్టాలు...

Updated : 30 Jul 2020 14:07 IST

ఉమర్‌ అక్మల్‌ నిషేధం కుదింపుపై డానిష్‌ కనేరియా

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నా ఒక్కడి విషయంలోనే జీరో టాలరెన్స్‌, ఇతరుల మీద కాదు. జీవితకాల నిషేధం నా మీదే కానీ వేరేవాళ్లకు కాదు. కులం, మతం, వర్ణం, నేపథ్యం లాంటి విషయాలను బట్టి చట్టాలు అమలౌతాయా? నేనొక హిందువును, ఈ విషయంలో గర్వంగా ఉన్నా’ అంటూ పాకిస్థాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా ట్వీట్‌ చేశాడు. తాజాగా పాక్‌ ఆటగాడు ఉమర్‌ అక్మల్‌ విషయంలో మూడేళ్ల నిషేధాన్ని 18 నెలలకు కుదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనేరియా స్పందిస్తూ గురువారం ట్వీట్‌ చేశాడు. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఉద్దేశిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించాడు. 

2012లో ఇంగ్లీష్‌ కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా కనేరియా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు అతడిపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో పాక్‌ ఆటగాడు అప్పటి నుంచీ ఎలాంటి క్రికెట్‌ ఆడలేకపోతున్నాడు. 2018లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నేరాన్ని అంగీకరించాడు. అయినా తనపై కనికరం చూపడం లేదంటూ ఇంతకుముందు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువు అయినందున పాక్‌ బోర్డు తన విషయంలో జోక్యం చేసుకోవట్లేదని ఆరోపించాడు. ఆటకు దూరమైనప్పటి నుంచీ జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నానని, కుటుంబ పోషన కోసం మళ్లీ క్రికెట్‌ ఆడాలని ఉందని, పీసీబీ చొరవ తీసుకొని అవకాశం కల్పించాలని కోరాడు. కాగా, ఆ విషయంలో తాము చేసేదేమీ లేదని, ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డే అతడికి శిక్ష విధించిందని, అక్కడే సంప్రదించాలని పీసీబీ ఇటీవల కనేరియాకు సూచించింది. మాజీ క్రికెటర్‌ అనిల్‌ దల్పత్‌ తర్వాత కనేరియానే పాక్‌ జట్టులో ఆడిన రెండో హిందూ ఆటగాడన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని