విరాట్‌కు పోటీయా! వార్నర్ ప్రశంసలివి

ఐసీసీ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెలిచిన టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీపై ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ రెండు పురస్కారాలకు అతడు అర్హుడని తెలిపాడు. ఎవరేమన్నా తమ తరంలో అత్యుత్తమ ఆటగాడు అతడేనని స్పష్టం చేశాడు. విరాట్‌కు వినూత్నంగా అభినందనలు తెలియజేశాడు....

Published : 29 Dec 2020 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెలిచిన టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీపై ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ రెండు పురస్కారాలకు అతడు అర్హుడని తెలిపాడు. ఎవరేమన్నా తమ తరంలో అత్యుత్తమ ఆటగాడు అతడేనని స్పష్టం చేశాడు. విరాట్‌కు వినూత్నంగా అభినందనలు తెలియజేశాడు.

ఐసీసీ పురస్కారాల్లో కోహ్లీ దుమ్మురేపాడు. ఈ దశాబ్దపు వన్డే ఆటగాడు, ఈ దశాబ్దపు సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ పురుష క్రికెటర్‌ పురస్కారాలను సొంత చేసుకున్నాడు. అంతేకాకుండా ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు వన్డే, టీ20, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా అతడిపై అనేకమంది అభిందనల జల్లు కురిపిస్తున్నారు. వార్నర్‌ సైతం వారితో జత కలిశాడు. విరాట్‌ కోహ్లీ వీడియోకు తన ఫేస్‌స్వాప్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ‘ఈ దశాబ్దపు ఆటగాడిని ఎవరూ గుర్తుపట్టలేరు. విరాట్‌ కోహ్లీకి అభినందనలు. నువ్వో సీరియస్‌ ఆటగాడివి. ఈ పురస్కారాలకు అర్హుడివి’ అని వ్యాఖ్య జత చేశాడు.

వార్నర్‌ పెట్టిన పోస్టుకు అభిమానుల నుంచి విపరీతంగా స్పందన లభించింది. గంటలోపే లక్షకు పైగా వీక్షణలు లభించాయి. కొందరైతే ప్రశ్నలు సంధించారు. పురస్కారాలు రానందుకు మీకు అసంతృప్తిగా లేదా అని ప్రశ్నించగా ‘అతడి (విరాట్‌)తో ఎవ్వరూ పోటీ పడలేరు’ అని జవాబిచ్చి మనసులు గెలిచాడు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ ‘నేనిది చేయాల్సింది. కానీ అతడు మా తరంలోనే అత్యుత్తమ ఆటగాడు’ అని స్పష్టం చేశాడు. కాగా తన సహచరుడు స్టీవ్‌స్మిత్‌ ఐసీసీ ఈ దశాబ్దపు టెస్టు ఆటగాడి అవార్డు గెలిచిన సంగతి తెలిసిందే. వార్నర్‌కు ఏ పురస్కారమూ రాకపోయినా ఐసీసీ ఈ దశాబ్దపు టెస్టు జట్టులో మాత్రం చోటు దక్కించుకోవడం గమనార్హం.

ఇవీ చదవండి
ధోనీకి అవార్డు తెచ్చిన సంఘటన ఇదే!
కోహ్లీ, ధోనీకి ప్రతిష్ఠాత్మక అవార్డులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని