ధోనీ.. ఇవి చిరకాలం మా వెంటే.. 

టీమ్‌ఇండియా మాజీ సారథి, బ్యాట్స్‌మన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తిరిగి ఎప్పుడెప్పుడు జట్టులోకి వస్తాడా అని ఆశిస్తుండగా రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు...

Updated : 04 Sep 2020 16:56 IST

మహీ బ్యాట్‌ నుంచి జాలువారిన ఆణిముత్యాలు

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ తిరిగి ఎప్పుడెప్పుడు జట్టులోకి వస్తాడా అని ఆశిస్తుండగా రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఏడాది కాలంగా ఆటకు దూరమైనా ఈసారి ఐపీఎల్‌లో రాణించి మళ్లీ భారత జెర్సీ ధరిస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. మరో ఏడాది ఆడినా ఇంకో టీ20 ప్రపంచకప్‌ అందిస్తాడనే గంపెడాశలు రేకిత్తిన వేళ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కానీ, మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటుంది. అదేంటంటే.. మహీ ఇప్పటికే టీమ్‌ఇండియాకు ఎంతో చేశాడు. విశ్వవేదికపై అతడు సాధించలేనిది ఏదీ లేని విధంగా చరిత్ర పుటల్లో నిలిచాడు. ఇప్పటివరకూ ఏ జట్టు సారథికి సాధ్యం కాని ఎన్నో ఘనతలు అందుకున్నాడు. ఉన్నతమైన ఆటగాడిగానే కాకుండా అత్యున్నతమైన వ్యక్తిగా ప్రత్యేకత సాధించాడు. ఈ క్రమంలో ఆడాలని అనిపించినన్ని రోజులు ఆడేశాడు. ఇక ఏదో ఒకరోజు తప్పుకోక తప్పదని  స్వాతంత్ర్య దినోత్సవాన్ని వేదికగా మలచుకున్నాడు. 

ధోనీ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండే ఇన్నింగ్స్‌:

*2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ 91*

శ్రీలంకతో టీమ్‌ఇండియా ఆడిన 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ను ఏ భారతీయుడూ మరిచిపోడు. ఆ మ్యాచ్‌లో ధోనీ(91 నాటౌట్‌; 79 బంతుల్లో 8x4, 2x6) ఆడిన ఇన్నింగ్స్‌.. చివర్లో కొట్టిన సిక్స్‌.. ఇంకా అభిమానుల కళ్లల్లో కదలాడుతూనే ఉన్నాయి. అలాంటి ఉత్కంఠభరితమైన పోరులో ముత్తయ్య మురళీధరన్‌, లసిత్‌ మలింగా లాంటి దిగ్గజాలను తట్టుకొని నిలిచాడంటే సాహసమే. గంభీర్‌(97)తో కలిసి జట్టు స్కోరును ముందుకు నడిపించినా, చివర్లో యువీ(21)తో కలిసి మ్యాచ్‌ను ముగించినా అది మహేంద్రుడికే దక్కింది. అందుకే అది ప్రత్యేకమైంది. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 

*అదే లంకపై తొలిసారి చెలరేగి 183*

2005లో అదే శ్రీలంక జట్టుకు మహీ తొలిసారి చుక్కలు చూపించాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో, మైమరపించే షాట్లతో కేరింతలు కొట్టించాడు. ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా లంక జట్టు భారత్‌లో పర్యటించింది. అంతకుముందే పాకిస్థాన్‌కు విశ్వరూపం చూపించిన మహీ ఈ మ్యాచ్‌లో తనలోని ఉగ్రరూపాన్ని పరిచయం చేశాడు. జైపుర్‌ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో తన వన్డే కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ (183 నాటౌట్‌; 145 బంతుల్లో 15x4, 10x6) బాదాడు. దీంతో లంక నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేశాడు. 

*తొలి శతకంతోనే పాకిస్థాన్‌కు వణుకు 148

బంగ్లాదేశ్‌తో తొలి సిరీస్‌లో రాణించలేకపోయిన అప్పటి జుంపాల జట్టు ఆటగాడు తర్వాత పాకిస్థాన్‌ వెన్నులో వణుకుపుట్టించాడు. భారత్‌లో లంక సిరీస్‌కు ముందే టీమ్‌ఇండియా చిరకాల ప్రత్యర్థి అయిన దాయాది దేశంతో ఐదు వన్డేల సిరీస్‌ ఆడింది. ఇక విశాఖలో జరిగిన రెండో వన్డేలో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 356/9 భారీ స్కోర్‌ సాధించింది. సాగర తీరాన మహీ(148; 123 బంతుల్లో 15x4, 4x6) చిన్నపాటి సునామీని తలపించాడు. ఆ మ్యాచ్‌తోనే ధోనీ అంటే ఏంటో క్రికెట్‌ ప్రపంచానికి అర్థమైంది. ఈ శతకమే అతడి గమనాన్ని, ప్రయాణాన్ని నిర్దేశించింది. ఎప్పటికీ ఇది ప్రత్యేకమే. అభిమానులెప్పుడూ వీటిని మర్చిపోరు. ఈ మధురానుభూతులు ఇచ్చినందుకు థాంక్యూ డియర్‌ ఎంఎస్‌డీ..

-ఇంటర్నెట్‌డెస్క్‌

ఎం.ఎస్‌.ధోనీ రిటైర్మెంట్‌కు సంబంధించిన మరిన్ని కథనాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు