ఇప్పుడైనా ఆస్ట్రేలియాపై చెలరేగుతాడా?

రోహిత్‌ శర్మ ఎట్టకేలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పాసవ్వడంతో ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి. శుక్రవారం బెంగళూరులోని ఎన్‌సీఏలో రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో రోహిత్ ఫిట్‌నెస్‌...

Updated : 22 Feb 2024 14:19 IST

కోహ్లీ గైర్హాజరీలో రోహిత్‌కు మంచి అవకాశం..

రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ పరీక్షలు పాసవ్వడంతో ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి. శుక్రవారం బెంగళూరులోని ఎన్‌సీఏలో రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో రోహిత్ ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడి ఆస్ట్రేలియా పర్యటనపై చాలా రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తొలి టెస్టు తర్వాత తిరిగి భారత్‌కు వస్తున్న నేపథ్యంలో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ జట్టులో చేరడం ఎంతైనా అవసరం. మరి ఈ అవకాశాన్ని హిట్‌మ్యాన్‌ సద్వినియోగం చేసుకుంటాడా లేదా వేచిచూడాలి. అలాగే రోహిత్‌ ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై వన్డేల్లో చెలరేగినట్లు టెస్ట్టుల్లో రాణించలేకపోయాడు. ఇప్పుడైనా తన బ్యాట్‌ ఝుళిపించి కొత్త రికార్డులు నమోదు చేస్తాడేమో చూడాలి.

ఆస్ట్రేలియాపై అదే అత్యధిక స్కోర్‌..

ఈ ముంబయి బ్యాట్స్‌మన్‌ గత ఆస్ట్రేలియా పర్యటన 2018-19లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అప్పుడతడు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు. అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో (37, 1) పరుగులే చేయడంతో రెండో టెస్టుకు అతడిని ఎంపిక చేయలేదు టీమ్‌ఇండియా. మళ్లీ మూడో టెస్టులో అవకాశం ఇవ్వడంతో జాగ్రత్తగా ఆడి తొలి ఇన్నింగ్స్‌లో (63*; 114 బంతుల్లో 5x4) పరుగులు చేశాడు. దీంతో ఆజట్టుపై అతడికిదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులే చేసి మరోసారి నిరాశపరిచాడు. అయితే, అప్పుడు పుజారా, కెప్టెన్‌ కోహ్లీ తమ బ్యాటింగ్‌తో రాణించడంతో భారత్‌ 2-1 తేడాతో తొలిసారి సిరీస్‌ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్‌ గత రికార్డును మెరుగు పర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

ఓపెనర్‌గా అదరగొట్టి..

ఆ పర్యటన తర్వాత రోహిత్‌ 2019లో చెలరేగిపోయాడు. అటు వన్డే ప్రపంచకప్‌లోనూ ఐదు శతకాలతో రెచ్చిపోయాడు. తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో రెండు శతకాలు, ఒక ద్వితశతకం బాది ఓపెనర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. జట్టు యాజమాన్యం అంచనాలకు మించి రాణించాడు. టెస్టుల్లో మిడిల్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగే హిట్‌మ్యాన్‌కు టీమ్‌ఇండియా ఈసారి ఓపెనర్‌గా అవకాశం ఇచ్చింది. దాంతో స్వేచ్ఛగా పరుగులు చేసి ఇక్కడా రాణించగలనని సత్తా చాటాడు. విశాఖలో జరిగిన తొలి టెస్టులో (176, 127) రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన అతడు రాంచీలో జరిగిన మూడో టెస్టులో(212) ఏకంగా డబుల్‌ సెంచరీ కొట్టాడు. తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో విఫలమయ్యాడు. తర్వాత టీమ్‌ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో రెండు టెస్టులు ఆడినా రోహిత్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక మళ్లీ ఇప్పుడే టెస్టుల్లో బరిలోకి దిగుతుండడంతో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

కంగారూలపై కొత్త రికార్డు సృష్టిస్తాడా?

ఇక 2013 నుంచీ ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో కొనసాగుతున్న ముంబయి బ్యాట్స్‌మన్‌ ఇప్పటివరకు మొత్తం 32 టెస్టులు ఆడాడు. అందులో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది దక్షిణాఫ్రికాపై బాదిన డబుల్‌ సెంచరీ(212) టెస్టుల్లో అతడికి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా నిలిచింది. అయితే, ఆస్ట్రేలియాపై గతపర్యటనలో చేసిన 63* పరుగులే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం. ఇక మొత్తంగా టెస్టుల్లో 6 శతకాలు, 10 అర్ధశతకాలు బాదిన అతడు 2,141 పరుగులు చేశాడు. కంగారూలపై 2 అర్ధశతకాలతో 279 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ ఈ పర్యటనలోనైనా కంగారూలపై టెస్టు శతకం బాదడంతోపాటు  జట్టును ముందుండు నడిపించాల్సిన అవసరం ఉంది. అలాగే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టాలని టీమ్‌ఇండియా ఆశిస్తోంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

 

ఇవీ చదవండి..

ఆ అయిదు రోజులూ అదే పాట..

ఆస్ట్రేలియాకు హిట్‌మ్యాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు