ధోనీసేనపై మరో పిడుగు!

వరుస ఓటములతో విలవిల్లాడుతున్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో టోర్నీకి పూర్తిగా దూరమవుతున్నాడు. మిగిలిన ఐదు మ్యాచుల్లో అతడు ఆడడని ఫ్రాంచైజీ..

Published : 22 Oct 2020 01:24 IST

సీజన్‌కు పూర్తిగా దూరమవుతున్న బ్రావో

దుబాయ్‌: వరుస ఓటములతో విలవిల్లాడుతున్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో టోర్నీకి పూర్తిగా దూరమవుతున్నాడు. మిగిలిన ఐదు మ్యాచుల్లో అతడు ఆడడని ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ ప్రకటించారు.

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 లీగులో ధోనీసేన పేలవ ప్రదర్శన చేస్తోంది. 10 మ్యాచులాడి కేవలం మూడింట్లోనే విజయం సాధించింది. 6 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. చెన్నై జట్టు గతంలో ఎప్పుడూ ఇంత దుస్థితిలో కనిపించలేదు. జట్టులోని కీలక ఆటగాళ్లంతా గాయాల బారిన పడ్డారు. అక్టోబర్‌ 17న దిల్లీతో జరిగిన మ్యాచులో గాయం కారణంగా బ్రావో ఆఖరి ఓవర్ ‌వేయని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘తొడ కండరాల గాయంతో డ్వేన్‌ బ్రావో మిగిలిన సీజన్‌కు పూర్తిగా  దూరం అవుతున్నాడు’ అని ఫ్రాంచైజీ సీఈవో విశ్వనాథన్ తెలిపారు.

ఈ సీజన్‌లో ఆరు మ్యాచులాడిన బ్రావో కేవలం 7 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో మాత్రం రాణించి 8.57 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన ధోనీసేన కేవలం 3 మాత్రమే గెలిచింది. దాదాపు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. కీలకమైన సురేశ్‌ రైనా, సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ వ్యక్తిగత కారణాలతో దూరమవ్వడంతోనే ఆ జట్టు సమతూకం దెబ్బతినింది. తొలుత బ్రావో సైతం గాయంతో ఆడలేదు. ఆ తర్వాత అంబటి రాయుడు గాయపడ్డాడు. కేదార్‌ జాదవ్‌ ఒక్క మ్యాచులోనూ సరిగ్గా ఆడలేదు. అన్నిటికీ మించి సారథి ఎంఎస్‌ ధోనీ ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని