పాక్‌పై ఆ మ్యాచ్‌లో సచిన్‌ ఎంత లక్కీనో!!

2011 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌(85; 115బంతుల్లో 11x4)...

Updated : 11 Aug 2020 14:23 IST

ఆ ఇన్నింగ్స్‌ను కొనియాడిన నెహ్రా

ఇంటర్నెట్‌‌ డెస్క్‌: 2011 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌(85; 115బంతుల్లో 11x4) బాధ్యతాయుతంగా ఆడి టీమ్‌ఇండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. లేదంటే జట్టు పరిస్థితి ఘోరంగా ఉండేది. అయితే, అతడు బ్యాటింగ్‌ చేస్తుండగా అప్పటికే నాలుగు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 27, 45, 70, 81 పరుగుల వద్ద పాక్‌ ఆటగాళ్ల తప్పులకు బతికిపోయాడు. అయినా చివరికి శతకానికి చేరవైన సమయంలో అజ్మల్‌ బౌలింగ్‌లో షాహిద్‌ అఫ్రిది క్యాచ్‌ అందుకోవడంతో వెనుతిరిగాడు. తర్వాత టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆఖరికి జట్టు స్కోర్‌ 260/9తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

తాజాగా నాటి విశేషాల్ని అప్పటి టీమ్‌ఇండియా పేసర్‌ ఆశిష్‌ నెహ్రా గుర్తుచేసుకున్నాడు. గ్రేటెస్ట్‌ రైవల్రీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ పాక్‌పై సచిన్‌ చెలరేగిన ఆ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో అదీ ఒకటని చెప్పాడు. ‘ఇప్పుడు ఓ విషయం చెప్పాల్సిన అవసరం లేకున్నా.. చెబుతున్నా. ఆ మ్యాచ్‌లో పలుమార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ రోజు సచిన్‌ ఎంత అదృష్టవంతుడో అతడికీ తెలుసు. ప్రపంచకప్‌లో ఒత్తిడి ఉంటుంది. ఏ జట్టు సెమీస్‌కు చేరినా అది గొప్ప జట్టే’నని వ్యాఖ్యానించాడు. అయితే, ఆటగాళ్లు ఒత్తిడిని జయించడమే ముఖ్యమని నెహ్రా పేర్కొన్నాడు. కాగా, ఆ మ్యాచ్‌లో ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ 231 పరుగులకే ఆలౌటైంది. తొలుత ఆ జట్టుకు మంచి ఆరంభమే లభించినా తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేకపోయారు. మధ్యలో మిస్బాఉల్‌ హక్‌(56) ఒంటరి పోరాటం చేసిన అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ లేక ఆ జట్టు ఓటమిపాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని