అతడి విషయంలో ఆందోళన అక్కర్లేదు: ఫించ్‌

ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్ స్టార్క్‌ ఫామ్‌లో లేకపోవడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. గత ఏడాది జరిగిన ప్రపంచకప్‌ అనంతరం స్టార్క్‌ సత్తాచాటలేకపోతున్నాడు

Published : 01 Dec 2020 20:25 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్ స్టార్క్‌ ఫామ్‌లో లేకపోవడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. గత ఏడాది జరిగిన ప్రపంచకప్‌ అనంతరం స్టార్క్‌ సత్తాచాటలేకపోతున్నాడు. ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ ఎక్కువగా పరుగులు సమర్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫించ్‌ అతడికి మద్దతుగా నిలిచాడు.

‘‘స్టార్క్‌ తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు. అయితే అతడిపై ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. గత ఎనిమిది, తొమ్మిదేళ్లుగా అతడు అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ప్రత్యేక్యంగా వైట్ బాల్ క్రికెట్‌లో గొప్పగా రాణిస్తున్నాడు. బంతిని స్వింగ్ చేయడాన్ని ఎంతో‌ ఆస్వాదిస్తాడు. కాగా, ప్రస్తుతం అతడు చక్కగానే బంతులు వేస్తున్నాడు. కానీ ఉత్తమ ఆటగాళ్లకు (టీమిండియా) వ్యతిరేకంగా ఆడుతున్న మ్యాచ్‌లో పరుగులను కట్టడిచేయలేం’’ అని ఫించ్ తెలిపాడు.

గాయంతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమైన వార్నర్‌ స్థానాన్ని వేడ్, లబుషేన్‌, అలెక్స్‌ కేరీలో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉందని ఫించ్ పేర్కొన్నాడు. ‘‘వన్డే, టీ20 క్రికెట్‌లో వార్నర్‌ అత్యుత్తమ ప్లేయర్‌. అతడి లేకపోవడం జట్టుకు లోటే. అయితే మా వద్ద నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాం. కాగా, మేం తుదిజట్టుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వార్నర్‌ స్థానంలో ఓపెనర్‌గా మాథ్యూ వేడ్‌, మార్నస్‌ లబుషేన్‌లో ఎవరైనా రావొచ్చు. అంతేగాక అలెక్స్‌ కేరీ కూడా అందుబాటులో ఉన్నాడు. అతడికి ఎంతో అనుభవం ఉంది’’ అని అన్నాడు. తమ జట్టు మిడిలార్డర్‌ గొప్పగా రాణిస్తుందని, వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఫించ్‌ వెల్లడించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆసీస్‌ ఆఖరి మ్యాచ్‌ కాన్‌బెర్రా వేదికగా బుధవారం ఆడనుంది. కాగా, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని