ENGvsPAK ‘ఫ్లెక్సీ టైం’ ప్లే!

అంతర్జాతీయ క్రికెట్‌ను నిర్విరామంగా కొనసాగించేందుకు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సరికొత్త మార్గాలు అన్వేషిస్తోంది. పాకిస్థాన్‌తో మూడో టెస్టు సవ్యంగా సాగేందుకు ‘ఫ్లెక్సీ టైమ్‌’ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించింది. వాతావరణాన్ని బట్టి నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందే...

Published : 20 Aug 2020 22:00 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌ను నిర్విరామంగా కొనసాగించేందుకు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సరికొత్త మార్గాలు అన్వేషిస్తోంది. పాకిస్థాన్‌తో మూడో టెస్టు సవ్యంగా సాగేందుకు ‘ఫ్లెక్సీ టైమ్‌’ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించింది. వాతావరణాన్ని బట్టి నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందే ఆటను మొదలు పెట్టనున్నారు. ఇందుకు రెండు జట్ల సారథులు, కోచ్‌లు అంగీకరించారని తెలిసింది.

కరోనా వైరస్‌ మహమ్మారి మొదలైన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలుపెట్టిన తొలిదేశం ఇంగ్లాండ్‌. బయో బుడగను సృష్టించి వెస్టిండీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడింది. సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదే ఉత్సాహంతో పాకిస్థాన్‌ను ఎదుర్కొంటోంది. మూడు టెస్టుల సిరీసులో ఒక మ్యాచ్‌ గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో టెస్టు వర్షార్పణం అయింది. ఐదురోజుల్లో మూడున్నర రోజులు ఆడేందుకు కుదర్లేదు. మొత్తంగా 134.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. డ్రా కావడంతో పాక్‌ సంతోషించినా ఆతిథ్య జట్టుకు అసంతృప్తే మిగిలింది. ఎందుకంటే ఆ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వాతావరణం అనుకూలించనప్పటికీ సంప్రదాయ పద్ధతిలో నిర్దేశిత సమయాల్లోనే మ్యాచులు మొదలు పెట్టడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్టేడియాలకు అభిమానులను అనుమతించడం లేదు. ప్రయాణం చేయాల్సిన పనిలేదు. దీంతో పరిస్థితులను బట్టి అరగంట ముందుగానే మ్యాచ్‌ ఆరంభించేందుకు ఐసీసీతో ఈసీబీ చర్చలు జరిపింది. రెండు జట్ల సారథులు, కోచ్‌లకు వివరించింది. అందుకు వారూ అంగీకరించారు. ప్రస్తుతం ఉదయం 11 గంటలకు ఆట మొదలవుతుంది. ఒకవేళ పరిస్థితి బాగాలేకుంటే 10:30 గంటలకే ఆటగాళ్లు మైదానంలోకి వచ్చేస్తారు. అయితే తొలిరోజు ఆట ముగిశాక రిఫరీతో మాట్లాడి తర్వాతి రోజు సమయాన్ని నిర్దేశిస్తారు. తుది నిర్ణయం మాత్రం రిఫరీదే.

రోజుకు 98 ఓవర్ల ఆట సాగాలి. సాధారణంగా ఆటను సాయంత్రం 6 గంటల్లోపు ముగించాలి. అత్యవసర పరిస్థితుల్లో 6:30 గంటల వరకు పెంచుతారు. వాతావరణం అనుకూలించడం లేదు కాబట్టి ఇప్పుడా ముగింపు (కటాఫ్‌) సమయాన్ని రాత్రి 7 గంటల వరకు పొడగించారు. ఒకవేళ మ్యాచ్‌ అరగంట ముందుగానే మొదలైతే తొలి సెషన్‌ రెండున్నర గంటలు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని