పాంటింగ్‌.. అలా చేస్తే క్రీడా స్ఫూర్తి అంటారా?

గతేడాది ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రవిచంద్రన్‌ అశ్విన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆడిన ఓ మ్యాచ్‌లో జోస్‌బట్లర్‌ను మన్కడింగ్‌ చేసిన సంగతి తెలిసిందే...

Published : 20 Aug 2020 18:51 IST

మన్కడింగ్‌పై మాజీ సారథిని ప్రశ్నించిన బ్రాడ్‌హాగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రవిచంద్రన్‌ అశ్విన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆడిన ఓ మ్యాచ్‌లో జోస్‌బట్లర్‌ను మన్కడింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇది అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. క్రికెట్‌ ప్రపంచాన్ని రెండుగా చీల్చింది. అలా ఔట్‌ చేయడం క్రీడా స్ఫూర్తికి విరద్ధమని కొందరు పేర్కొనగా, అది క్రికెట్‌ నిబంధనల్లో భాగమేనని మరికొందరు సమర్థించారు. అయితే, అశ్విన్‌ కూడా తన ప్రవర్తనను సమర్థించుకున్నాడు. తానేమీ నియమాలకు వ్యతిరేకంగా చేయలేదని వివరణ ఇచ్చాడు. 
ఇదిలా ఉండగా అశ్విన్‌ ఈసారి దిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలో పంజాబ్‌ అతడిని వదులుకుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ బుధవారం మన్కడింగ్‌ వివాదాన్ని మరోసారి లేవనెత్తాడు. ఈ విషయంపై అశ్విన్‌తో గట్టిగా మాట్లాడతానని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని చెప్పాడు. దిల్లీ క్యాపిటల్స్‌ అలాంటివి ఆశించదని.. కాబట్టి ఈ సీజన్‌లో అటువంటివి పునరావృతం చేయొద్దని సర్దిచెబుతానన్నాడు. అయితే, అశ్విన్‌ కూడా అందుకు ఒప్పుకోకపోవచ్చని వివరించాడు. 

కాగా, పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఒకప్పటి తన సహచర ఆస్ట్రేలియా ఆటగాడు బ్రాడ్‌హాగ్‌ వ్యతిరేకించాడు. తాజాగా అతడు ఓ ట్వీట్‌ చేస్తూ.. ‘బౌలర్‌ బంతి వేయకముందే నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ క్రీజు వదిలి ముందుకు వెళ్లడం.. అది తమ జట్టుకు లాభం చేకూరుస్తుందని తెలిసినా అలా చేయడం.. క్రీడా స్ఫూర్తి అంటారా?’ అని ప్రశ్నించాడు. దీనిపై పాంటింగ్‌ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. మరోవైపు వచ్చేనెల 19 నుంచి యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పట్లు వేగంగా జరిగిపోతున్నాయి. ఆటగాళ్లు కూడా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడంతో పాటు క్రికెట్‌ సాధన కూడా ప్రారంభించారు. రెండు, మూడు రోజుల్లో పలు ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను అక్కడికి పంపిచే పనిలో నిమగ్నమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు