Updated : 12/11/2020 14:31 IST

ఆ జట్లు వీళ్లని వదులుకోవచ్చు..

వచ్చే వేలంలో ఎవరెవరు వెళ్లిపోతారో పరిశీలిస్తే..

ప్రపంచంలోని ఏ లీగ్‌లో ఏ ఫ్రాంఛైజీ అయినా తమ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటుంది. సహజంగా మంచి ప్రదర్శన చేసేవారిని ఎంత ధరకైనా కొనుగోలు చేస్తాయి. ఆ టోర్నీలో అత్యుత్తమంగా రాణించి తమకు విజయాలు అందిస్తాడని ఆశిస్తాయి. అయితే, కొన్నిసార్లు ఆయా ఆటగాళ్లు రాణించొచ్చు.. లేదా రాణించకపోవచ్చు. కానీ, ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోతే ఏ ఫ్రాంఛైజీ అయినా నిరుత్సాహ పడుతుంది. ఇక తదుపరి సీజన్‌లో ఉంచాలా వద్దా అనే విషయంపై దృష్టి సారిస్తుంది. ఈ విషయం పక్కనపెడితే.. తాజాగా యూఏఈలో జరిగిన టీ20 లీగ్‌ 13వ సీజన్‌లోనూ పలువురు ఆటగాళ్లు నిరాశ పరిచారు. వారెవరో.. 2021 వేలంలో మళ్లీ అదే జట్ల తరఫున ఉంటారో లేదో పరిశీలిద్దాం.. 


చావ్లా పని అయిపోయిందా?

13వ సీజన్‌కు చెన్నై పీయుష్‌ చావ్లాను రూ.6.75 కోట్ల ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. అయితే, అతడు మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. మొత్తం ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లాడిన ఈ లెగ్‌స్పిన్నర్‌ 7.87 ఎకానమీతో 191 పరుగులిచ్చాడు. ఇక 6 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో వచ్చే సీజన్‌లో చెన్నై అతడిని కొనసాగించడం అనుమానంగా అనిపిస్తోంది.


దిల్లీకి బదిలీ అయ్యేసరికి రహానేకేమైంది?

దిల్లీ జట్టులో అజింక్య రహానె ఈసారి చెప్పుకోదగిన రీతిలో రాణించలేదు. అతడు గతేడాది వరకు రాజస్థాన్‌ తరఫున కీలక బ్యాట్స్‌మన్‌. అయితే, అక్కడ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉండడంతో ఈసారి దిల్లీకి బదిలీ చేసినట్లు రాజస్థాన్‌ యాజమాన్యం ఓ సందర్భంలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి శ్రేయస్‌ అయ్యర్‌ టీమ్‌లో ఆడిన రహానె 9 మ్యాచ్‌ల్లో కేవలం 113 పరుగులే చేశాడు. 14.12 సగటుతో 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాదడంతో వచ్చే ఏడాది ఇదే జట్టులో కొనసాగడం గగనమనిపిస్తోంది.


కాట్రెల్‌ సెల్యూట్లు మాయం..

పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ తర్వాత అత్యంత ప్రమాదకర బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌. ఈ విండీస్‌ పేసర్‌ ఇటు పవర్‌ప్లేలో అటు డెత్‌ ఓవర్లలో స్పెషలిస్టు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టడంలో దిట్ట. అయినా, రాజస్థాన్‌తో ఓ మ్యాచ్‌లో రాహుల్‌ తెవాతియా (ఒక ఓవర్‌లో 5 సిక్సులు) దెబ్బకు కుదేలైపోయాడు. 6 మ్యాచ్‌ల్లో 120 బంతులేసి 176 పరుగులిచ్చాడు. కేవలం 6 వికెట్లే తీశాడు. దీంతో వచ్చే సీజన్‌లో పంజాబ్‌ తరఫున ఆడేది సందేహంగా ఉంది.


రెండు విధాలుగా విఫలమైన నరైన్‌..

కోల్‌కతా జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు సునీల్‌ నరైన్‌. సీనియర్‌ ఆటగాడిగా ఎంతో అనుభవమున్న ఆల్‌రౌండర్‌. అటు బంతితో మాయ చేస్తూనే ఇటు బ్యాట్‌తో రాణించగలడు. అలాంటి ఆటగాడు గత రెండు సీజన్లలో పూర్తిగా విఫలమయ్యాడు. గతేడాది 12 మ్యాచ్‌ల్లో 143 పరుగులే చేసిన అతడు ఈసారి 10 మ్యాచ్‌ల్లో 121 పరుగులే చేశాడు. మరోవైపు బంతితోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. గత సీజన్‌లో 10 వికెట్లు తీయగా ఈ సారి 5 వికెట్లే పడగొట్టాడు. దీంతో నరైన్‌ కూడా వచ్చే సీజన్‌లో కోల్‌కతా తరఫున కనిపించడం కష్టమనే అనిపిస్తోంది.


సవారీ చేయలేకపోతున్న సౌరభ్‌ తివారి..

ముంబయి జట్టులో పెద్దగా మార్పులేమీ చోటుచేసుకునే అవకాశం లేకున్నా సౌరభ్‌ తివారి ఒక్కడే ఈ సీజన్‌లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే, రోహిత్‌సేన ఏ ఆటగాడిని కూడా అంత తేలిగ్గా వదులుకోదనే నమ్మకం ఉంటుంది. అయినా, వేలంలో వదులుకోవాల్సి వస్తే సౌరభ్‌ తివారి ఒక్కడే ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 20.60 సగటుతో 103 పరుగులే చేశాడు. దీంతో తివారీని తీసేసి వేరే ఆటగాడిని ఎంపిక చేసుకున్నా ఆశ్చపోవాల్సిన పనిలేదు.


ఉతకలేకపోయిన రాబిన్‌ ఉతప్ప..

కోల్‌కతా ఆటగాడైన రాబిన్‌ ఉతప్పను రాజస్థాన్‌ ఎంతో ఆశపడి మరీ తమ జట్టులోకి తీసుకుంది. పెద్ద మొత్తంలో ధర పలకకపోయినా అతడిలో దూకుడుగా ఆడే సత్తా ఉండటంతో ఆలోచించి తీసుకుంది. జట్టు పరిస్థితులను బట్టి మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ నుంచి టాప్‌ ఆర్డర్‌ వరకు విభిన్న పాత్రలు పోషించాడు. అయినా ఒక్క మ్యాచ్‌లో 42 పరుగులు మినాహయించి ఏ మ్యాచ్‌లోనూ రాణించలేదు. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 16.33 సగటుతో 196 పరుగులే చేశాడు. దాంతో వచ్చే ఏడాది  ఈ జట్టులో కొనసాగడం సందేహంగా ఉంది.


స్టెయిన్‌, ఉమేశ్‌కు ఉద్వాసనా?

బెంగళూరు జట్టులో ఉమేశ్‌ యాదవ్‌, డేల్‌స్టెయిన్‌ పని అయిపోయిందనే అనిపిస్తోంది. ఈ ఇద్దరు సీనియర్లు గత రెండు సీజన్లలో అస్సలు ఆకట్టుకోలేదు. ఉమేశ్‌ ఈ ఏడాది 2 మ్యాచ్‌లే ఆడినా ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. మరోవైపు 11.85 ఎకానమీతో 83 పరుగులు ఇచ్చాడు. దీంతో అతడి ప్రదర్శనపై అనేక విమర్శలు వచ్చాయి. ఇక దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ వయసు పైబడిన కొద్దీ రాణించలేకపోతున్నాడు. అతడు కూడా ఈ రెండు సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్‌లో 3 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్‌ మాత్రమే తీసి 133 పరుగులిచ్చాడు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌లో బెంగళూరు వీరిని కొనసాగించడం కషమే.


షేక్‌ చేయలేకపోతున్న అభిషేక్‌ శర్మ..

హైదరాబాద్‌ జట్టులో గత మూడు సీజన్లుగా ఆడుతున్నా పెద్దగా అవకాశాలు రాని అభిషేక్‌ శర్మకు ఈసారి మెరుగైన అవకాశాలే వచ్చాయి. అయితే వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 2018లో తొలిసారి జట్టులోకి వచ్చిన అభిషేక్‌ మూడు మ్యాచ్‌లు ఆడగా ఒకసారి 46* పరుగులు చేశాడు. దాంతో గతేడాది కూడా కొనసాగాడు. అప్పుడు కూడా మూడు మ్యాచ్‌ల్లో ఆడి పూర్తిగా విఫలమయ్యాడు. కానీ ఈ సీజన్‌లో కీలక ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతడికి అవకాశం వచ్చింది. 8 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో 71 పరుగులు చేసిన అతడు బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు. 2 వికెట్లే తీసి 9.10 ఎకానమీతో 91 పరుగులిచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్‌ను కొనసాగించడం కష్టంగా అనిపిస్తోంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని