మన పేసర్లు వారికి చుక్కలు చూపిస్తారు..

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ తిరిగొచ్చినా టీమ్‌ఇండియా భయపడదని మాజీ ఓపెనర్‌...

Published : 17 Jul 2020 01:38 IST

ఐసీసీ ఛైర్మన్‌గా గంగూలీ ఉంటే బాగుంటుంది: గంభీర్

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ తిరిగొచ్చినా టీమ్‌ఇండియా భయపడదని మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన గంభీర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌ఇండియా బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ కాపాడుకోవాలని సూచించాడు. 2018-2019 సీజన్‌లో విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపైనే కంగారు పెట్టించిన సంగతి తెలిసిందే. అప్పుడు వార్నర్‌, స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకోవడంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు. దీంతో వారిద్దరూ లేని ఆస్ట్రేలియాపై భారత్‌ 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఆ ట్రోఫీని మరోసారి కాపాడుకోవాలని గంభీర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఏ జట్టుకైనా సవాలు విసిరే ఫాస్ట్‌ బౌలర్లు భారత జట్టుకు ఉన్నారని, ఈ నేపథ్యంలో గత పర్యటన లాగే ఈసారి కూడా టీమ్‌ఇండియా పేసర్లు ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపిస్తారని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. ఈసారి డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ ఆడుతున్నా భయపడాల్సిన అవసరం లేదన్నాడు. అనంతరం ఐసీసీ ఛైర్మన్‌ పదవిపై స్పందించిన మాజీ క్రికెటర్‌. సౌరభ్‌ గంగూలీ ఆ పదవికి పోటీ చేయాలని ఆకాంక్షించాడు. ఈ విషయంలో దాదా ఏమనుకుంటున్నాడో తనకు తెలియదని, కానీ అంతర్జాతీయ క్రికెట్‌ మండలిలో అత్యున్నత పదవిలో భారత ప్రతినిధి ఉంటే బాగుంటుందని చెప్పాడు. కాగా, ఐసీసీ ఛైర్మన్‌గా రెండు పర్యాయాలు కొనసాగిన శశాంక్‌ మనోహర్‌ ఇటీవలే ఆ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖ్వాజా ప్రస్తుతం ఆ బాధ్యతల్ని చేపట్టాడు. ఐసీసీ తదుపరి ఛైర్మన్‌ను ఎన్నుకునేంతవరకు ఇమ్రాన్‌ ఆ బాధ్యతలు చూస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని