ఆసీస్‌ ఆందోళనే నిజమైంది: గంభీర్‌

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ గురించే చర్చిస్తోంది. భారత్×ఆస్ట్రేలియా మ్యాచ్‌లో జడేజా స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా చాహల్‌ మైదానంలోకి రావడం సరైనదని కొందరు అభిప్రాయపడుతుండగా..

Published : 05 Dec 2020 20:37 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ గురించే చర్చిస్తోంది. భారత్×ఆస్ట్రేలియా మ్యాచ్‌లో జడేజా స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా చాహల్‌ మైదానంలోకి రావడం సరైనదని కొందరు అభిప్రాయపడుతుండగా.. మరికొందరు తప్పుపడుతున్నారు. తాజాగా దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్ మాట్లాడాడు. కంకషన్‌కు గురైనప్పుడు ఐసీసీ నిబంధనలు ఎందుకు ఉపయోగించుకోకూడదని ప్రశ్నించాడు. జడేజా కంకషన్‌కు గురైతే చాహల్‌ను తీసుకోవడం సరైన నిర్ణయమేనని అన్నాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో స్టార్క్‌ వేసిన బంతి జడేజా హెల్మెట్‌కు తగిలిన సంగతి తెలిసిందే.

‘‘అది మ్యాచ్‌ రిఫరీ తీసుకున్న నిర్ణయం. అదే కీలకం. అయితే దానిపై ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్ లాంగర్‌ అసంతృప్తితో ఉన్నాడు. ఎందుకంటే తొడకండరాల పట్టేయడంతో జడేజా బ్యాటింగ్‌ చేస్తూ కాస్త ఇబ్బంది పడ్డాడు. అంతేకాకుండా అతడి స్థానంలో ఉత్తమ టీ20 బౌలర్‌ చాహల్ రావడం వారికి ఆందోళన కలిగించింది. తమ జట్టును చాహల్ దెబ్బతీస్తాడని వారు భావించారు. అదే జరిగింది. చాహల్ మ్యాచ్‌ను ఎంతో ప్రభావితం చేయగలడు’’ అని గంభీర్‌ అన్నాడు.

జడేజాకు బంతి తగిలినప్పుడు ఫిజియో, వైద్యుడు ఎవరూ మైదానంలోకి రాలేదని, జడ్డూ కంకషన్‌కు గురికాలేదని వస్తున్న అభిప్రాయాలపై గంభీర్ స్పందించాడు. ‘‘జడేజాకు డిలేయ్‌డ్‌‌ కంకషన్‌ కావొచ్చు. అతడు కంకషన్‌కు గురైతే, కంకషన్‌ నిబంధనలను ఎందుకు ఉపయోగించకూడదు? తమ వద్ద ఉన్న మణికట్టు స్పిన్నర్‌తో భారత్‌ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది’’ అని తెలిపాడు. కాన్‌బెర్రా వేదికగా జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన 11 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది.

ఇవీ చదవండి

జడేజా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌పై రచ్చ?

నాటి ఆసీస్‌ లాభం.. కోహ్లీసేనతో నష్టమైందా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని