తండ్రి కల నెరవేరింది.. సిరాజ్ భావోద్వేగం

హైదరాబాదీ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా విధి అతడిని పరీక్షించింది. జట్టుతో కలిసి సిడ్నీ క్వారంటైన్‌లో...

Published : 27 Dec 2020 00:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాదీ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా విధి అతడిని పరీక్షించింది. జట్టుతో కలిసి సిడ్నీ క్వారంటైన్‌లో ఉన్న సమయంలో సిరాజ్‌ తండ్రి అనారోగ్యంతో మరణించారు. భారత్‌కు వెళ్లి వస్తే క్వారంటైన్‌ ఇబ్బందులుంటాయన్న ఉద్దేశంతో అంత్యక్రియలకు హాజరుకాలేదు. భారత్‌ తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తే చూడాలనుకున్న తన తండ్రి కల కోసం.. బాధను భరిస్తూ ఆసీస్‌లోనే ఉండిపోయాడు. కానీ తొలి టెస్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే, షమి గాయంతో బాక్సింగ్ డే టెస్టులో చోటు సంపాదించాడు.

రెండో టెస్టు తొలి రోజు ఆటలో సిరాజ్‌ బౌలింగ్ చేయడానికి ఎంతో సమయం పట్టింది. కెప్టెన్ రహానె వ్యూహాల్లో భాగంగా తొలి సెషన్ అనంతరం బంతిని అందుకున్నాడు. ఆలస్యంగా బౌలింగ్‌కు వచ్చినా రెండు వికెట్లతో సత్తాచాటాడు. ఆసీస్‌ కీలక ఆటగాళ్లు లబుషేన్‌, గ్రీన్‌ను తెలివిగా బోల్తాకొట్టించి భారత్ పైచేయి సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. సిరాజ్‌ తొలి వికెట్ సాధించిన అనంతరం ఆకాశం వైపు చేతులు చూపిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.

తొలి రోజు ఆట ముగిసిన అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా క్యాప్‌ను అందుకున్న తర్వాత నా జీవితంలో విలువైనది సాధించనట్లుగా అనిపించింది. రహానె, బుమ్రాతో మాట్లాడిన అనంతరం ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అయితే మైదానంలోకి వచ్చిన తర్వాత బౌలింగ్ చేయాలని ఎంతో ఆతృతగా ఎదురుచూశాను. కానీ లంచ్‌ తర్వాత నేను బౌలింగ్‌ చేయాలని రహానె చెప్పాడు. ఎందుకంటే పిచ్‌పై తేమ ఉండటంతో స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. లంచ్ విరామం తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. దీంతో డాట్ బాల్స్‌ వేస్తూ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురావాలని భావించా’’ అని సిరాజ్ పేర్కొన్నాడు.

సిరాజ్‌ అరంగేట్రం గురించి అతడి సోదరుడు ఇస్మాయిల్‌ మాట్లాడుతూ..‘‘భారత్‌ తరఫున సిరాజ్‌ టెస్టుల్లో, వన్డేల్లో ఆడాలన్నది మా నాన్న కల. అది ఈ రోజు నెరవేరింది. అయితే రెండో టెస్టు జట్టులో సిరాజ్ పేరు ప్రకటించిన అనంతరం మాకు నిద్ర పట్టలేదు. సిరాజ్‌ ప్రదర్శన చూడటానికి రాత్రంతా ఆశగా ఎదురుచూశాం. ఉదయం నాలుగు గంటలకి టీవీ ఆన్‌ చేసి అతడి‌ బౌలింగ్ కోసం ఎదురుచూడటం ప్రారంభించాం. కానీ ఎంతో సేపు తర్వాత తొలి ఓవర్‌ వేశాడు’’ అని చెప్పుకొచ్చాడు.  

ఇదీ చదవండి

సిరాజ్, గిల్‌కు అది ఎంతో స్పెషల్‌

జింక్స్‌ ఎత్తులకు కంగారూలు చిత్తు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని