‘36’తో టీమ్‌ఇండియాకు తలనొప్పే

తమ టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరుకే చాపచుట్టేయడం టీమ్‌ఇండియాకు తలనొప్పులు తెప్పిస్తుందని ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ అన్నాడు. అత్యుత్తమ ఆటగాడైన విరాట్‌ కోహ్లీ వెళ్లిపోవడమూ పెద్ద లోటని పేర్కొన్నాడు. గులాబి టెస్టులో విజయం తర్వాత అతడు....

Published : 19 Dec 2020 19:39 IST

అడిలైడ్‌: తమ టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరుకే చాపచుట్టేయడం టీమ్‌ఇండియాకు తలనొప్పులు తెప్పిస్తుందని ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ అన్నాడు. అత్యుత్తమ ఆటగాడైన విరాట్‌ కోహ్లీ వెళ్లిపోవడమూ పెద్ద లోటని పేర్కొన్నాడు. గులాబి టెస్టులో విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. అడిలైడ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 36 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.

‘36 పరుగులకే బౌలౌట్‌  కావడం భారత జట్టుకు తలనొప్పులు సృష్టిస్తుంది. వాళ్ల అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ సైతం వెళ్లిపోతున్నాడు. ఇది టీమ్‌ఇండియాకు కచ్చితంగా లోటే’ అని హేజిల్‌వుడ్‌ అన్నాడు. అయితే కోహ్లీ లేకపోవడం మరో ఆటగాడు సత్తా చాటుకొనేందుకు అవకాశమని అతడు పేర్కొన్నాడు. ‘విరాట్‌ అంత కాకపోయినా ఆ జట్టులో నాణ్యమైన క్లాస్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇక సిరీస్‌ విషయానికి వస్తే గతానికి భిన్నంగా ఒక మెట్టు ఎక్కువే ఉండటం గొప్ప’ అని వెల్లడించాడు. ప్రస్తుతం సాధించిన విజయం చరిత్ర అని, ఇక మున్ముందు జరగాల్సిన సిరీస్‌పై దృష్టిసారించాలని హేజిల్‌వుడ్‌ తన సహచరులకు సూచించాడు.

‘మళ్లీ బ్యాటర్లు, బౌలర్లు కొత్తగా మొదలుపెట్టాలి. విరాట్‌ స్థానంలో అక్కడ మరో ఆటగాడు వస్తాడు. నిజం చెప్పాలంటే టీమ్‌ఇండియా రిజర్వుబెంచీపై నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. అంటే వారికోసమూ మేం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని హేజిల్‌వుడ్‌ అన్నాడు. మ్యాచులో గాయపడ్డ భారత పేసర్‌ మహ్మద్‌ షమి పరిస్థితి ఏంటో తమకు తెలియదని పేర్కొన్నాడు. ‘షమి అద్భుతమైన పేసర్‌. మ్యాచులోనూ అతనేంటో చూపించాడు. అతడి స్థానంలో మరొకరిని భర్తీ చేసుకోవాలంటే టీమ్‌ఇండియాకు కష్టమే. అతడి గాయం ఎంత తీవ్రమైందో నాకు తెలియదు. కానీ షమి త్వరగా కోలుకొని ఆడాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.

ఇవీ చదవండి
పెద్ద జట్లు.. చిన్న స్కోర్లు: ఎందుకీ విలవిల?
భారత్‌‌ తప్పుకాదు..ఓటీపీని మరిచిపోవాలి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని