కోహ్లీ త్వరలో ప్రపంచకప్‌ సాధిస్తాడు: భజ్జి

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎంతటి గొప్ప బ్యాట్స్‌మనో అంత గొప్ప కెప్టెన్‌ కూడా ఐదేళ్లుగా అటు టెస్టుల్లో మూడేళ్లుగా ఇటు వన్డేల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు...

Published : 23 Nov 2020 10:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎంతటి గొప్ప బ్యాట్స్‌మనో.. అంత గొప్ప కెప్టెన్‌ కూడా. ఐదేళ్లుగా అటు టెస్టుల్లో.. మూడేళ్లుగా ఇటు వన్డేల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాను అత్యుత్తమంగా ముందుకు తీసుకెళుతున్నాడు. అయితే, కోహ్లీ ఎన్ని విజయాలు సాధించినా అతడి కెరీర్‌లో ఇప్పటివరకూ ఓ లోటు ఉంది. అదే ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా తొలిసారి ఆ అవకాశాన్ని కోల్పోయిన విరాట్‌.. గతేడాది 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ రెండోసారి సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దీంతో తన సారథ్యంలో ఐసీసీ కప్పు సాధించాలనే కోరిక అలాగే ఉండిపోయింది. అయితే, త్వరలోనే టీమ్‌ఇండియా సారథి ఆ ఘనత సాధిస్తాడని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. 

‘ఏ కెప్టెన్‌ అయినా ప్రపంచకప్‌ సాధించాలని అనుకుంటాడు. 2021లో కోహ్లీ అది సాధిస్తే బాగుంటుంది. దాంతో అతడేం పెద్ద ఆటగాడు అయిపోడు. ఎందుకంటే కోహ్లీ ఇప్పటికే గొప్ప క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు‌. కానీ ప్రపంచకప్‌ గెలవడం అనేది అతడి కీర్తి ప్రతిష్ఠలకు మరింత వన్నె తెస్తుంది. ఇప్పుడున్న టీమ్‌ని బట్టి చూస్తే కోహ్లీ ఐసీసీ కప్పు సాధించకుండా వెనుతిరగడని అనిపిస్తోంది. త్వరలోనే ఆ కలను నిజం చేసుకుంటాడు. బహుశా 2021లో లేదా తర్వాతి సీజన్‌లో..’ అని భజ్జీ ఇండియా టుడే’తో అన్నాడు. కాగా, కోహ్లీ నేతృత్వంలో టీమ్‌ఇండియా 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌ చేతిలో ఓటమిపాలవ్వగా గతేడాది ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో విఫలమైంది. దీంతో టీమ్‌ఇండియా రెండుసార్లు కప్పు చేజార్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని