పాండ్య ఎందుకలా చేశాడు..?

ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఆల్‌రౌండ్‌ హార్దిక్‌ పాండ్య వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ మెరుపు అర్ధశతకం కూడా పూర్తి చేశాడు. దీంతో ముంబయి అనుకున్నదానికంటే ఎక్కవ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించింది.

Published : 26 Oct 2020 18:08 IST

(photo: pandya twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం రాజస్థాన్‌, ముంబయి మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. మెరుపు అర్ధశతకం పూర్తి చేశాడు. దీంతో ముంబయి అనుకున్నదానికంటే ఎక్కవ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించింది. అయితే.. అర్ధశతకం అనంతరం పాండ్య మోకాళ్లపై కూర్చొని చేయి పైకెత్తి పిడికిలి బిగించి డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు చూపించాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న ముంబయి కెప్టెన్‌ పొలార్డ్‌ సైతం నవ్వుతూ స్పందనగా పిడికిలి బిగించి చేయి పైకెత్తాడు. అయితే.. ఊహించిన దానికంటే ఎక్కువ స్కోరును జట్టుకు అందించినందుకే పాండ్య అలా చేసి ఉంటాడని అనుకున్నారందరూ. కానీ.. దాని వెనుక అసలు విషయం వేరే ఉంది. అదేంటో పాండ్య తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.
తాను పిడికిలి పైకెత్తిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన పాండ్య.. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అంటూ రాసుకొచ్చాడు. క్రికెట్‌లో జాత్యాంహకారానికి వ్యతిరేకంగా నల్లజాతి ఆటగాళ్లు చేస్తున్న పోరాటమే ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’. ముంబయి జట్టు కెప్టెన్‌ పొలార్డ్‌ సైతం నల్లజాతి ఆటగాడే కావడం గమనార్హం. అందుకే పొలార్డ్‌ వైపు చూపిస్తూ పాండ్య తన మద్దతు ఇలా తెలిపాడు. ఇటీవల హైదరాబాద్‌ ఆటగాడు, వెస్టిండీస్‌ క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ విషయాన్ని లేవనెత్తాడు. బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 లీగ్‌లోనూ నల్ల జాతీయుల పోరాటానికి మద్దతు లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా.. హార్దిక్‌ పాండ్య ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’కు మద్దతు ఇవ్వడంతో అతనిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో వీరవిహారం చేసిన పాండ్య కేవలం 21 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. అందులో 7 భారీ సిక్సర్లున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ చెలరేగి శతకం చేయడంతో ముంబయి ఓటమి పాలైంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు