శ్రమకు ఫలితం దక్కింది : రోహిత్‌ శర్మ

వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబయి జట్టు ఫ్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో ఆ జట్టు సారథి రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు పడిన శ్రమకు ఫలితం దక్కిందని ఈ స్టార్‌ ఆటగాడు

Published : 02 Nov 2020 00:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబయి జట్టు ఫ్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో ఆ జట్టు సారథి రోహిత్‌శర్మ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు పడిన శ్రమకు ఫలితం దక్కిందని ఈ స్టార్‌ ఆటగాడు అభిప్రాయపడ్డాడు. యూఏఈలో జరుగుతున్న ఈ మెగా టీ20 లీగ్‌లో 13 మ్యాచులాడిన ముంబయి 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఫ్లేఆఫ్స్‌ నుంచి ఫైనల్‌కు చేరుకోవడానికి ముంబయికి రెండు అవకాశాలు లభించాయి. 

‘మేము ఫ్లేఆఫ్స్‌కు చేరుకున్నామని తెలుసు. ఈ స్థితిలో ఉండటం గొప్ప విషయం. యూఏఈకి రాకముందు, వచ్చిన తర్వాత మేము పడిన శ్రమకు మాకు ఫలితం దక్కింది. ప్రస్తుతం మేము ఇంకో అవరోధాన్ని దాటాలి. లీగ్‌లో మిగిలిన కొన్ని మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది’ అని ముంబయి జట్టు యాజమాన్యం తన ట్విటర్ ఖాతాలో పెట్టిన వీడియోలో రోహిత్‌ అన్నాడు. 

లీగ్‌స్థాయిలో ముంబయి చివరిగా నవంబరు 3న షార్జాలో హైదరాబాద్‌ జట్టుతో తలపడనుంది. ఇందులో గెలిచి ఫ్లేఆఫ్స్‌కు చేరాలని వార్నర్‌ జట్టు గట్టి పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌ కూడా తమకు ముఖ్యమైందని రోహిత్‌ తెలిపాడు. ప్రత్యర్థి జట్టు గురించి తాము ఆలోచించట్లేదని హిట్‌మ్యాన్‌ వివరించాడు. ఇదిలా ఉంటే రెండు వారాల కిందట పంజాబ్‌తో జరిగిన డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో రోహిత్‌ గాయపడ్డాడు. అప్పటి నుంచి తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్‌ ముంబయి ఆడిన చివరి నాలుగు మ్యాచులకు దూరమయ్యాడు.  గాయం కారణంతో ఆస్ట్రేలియా పర్యటనకు సైతం ఈ స్టార్‌ ఓపెనర్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని