రాముని అందం అందులో కాదు.. ఇందులో ఉంది

మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగంగా జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజపై స్పందించాడు...

Updated : 06 Aug 2020 14:42 IST

అయోధ్య భూమి పూజపై పాక్‌ క్రికెటర్‌ కనేరియా ఏమన్నాడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగంగా జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజపై స్పందించాడు. బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాక్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా సైతం తన సంతోషాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. హిందువులకు ఇదొక చారిత్రక ఘట్టం అని, శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని ట్వీట్‌ చేశాడు. కలిసి ఉండటం, సోదరభావంతో మెలగడం వంటి విషయాలు శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవచ్చని చెప్పాడు. 

‘రాముడిలోని అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగిఉంది. చెడుపై మంచి గెలుస్తుందనడానికి అతనో సూచిక. రామ మందిరానికి భూమి పూజ జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సంబరపడుతున్నారు. ఆత్మ సంతృప్తికి ఇదో గొప్ప కార్యం’ అని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండగా, కనేరియా చాలా రోజుల నుంచి తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని పాక్‌ బోర్డును వేడుకుంటున్నాడు. తాను హిందువు అయినందునే పీసీబీలో తనకు మద్దతు లేదని వ్యాఖ్యానించాడు. ఇటీవల ఓ పాక్‌ ఆటగాడి విషయంలో మూడేళ్ల నిషేధాన్ని సగం వరకు తగ్గించడంతో మరోసారి తన బాధను ట్విటర్‌లో వెల్లడించాడు. అయితే, పీసీబీ మాత్రం తమ చేతుల్లో ఏమీ లేదని, అతడిపై నిషేధాన్ని విధించింది ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డని స్పష్టం చేసింది. అక్కడికే వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని  సూచించింది. కాగా, కనేరియా 2012లో ఇంగ్లీష్‌ కౌంటీ క్రికెట్‌లో ఆడుతూ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని