అర్ధశతకాలతో చెలరేగిన వేడ్‌, మాక్సీ

మాథ్యూ వేడ్‌ (80; 53 బంతుల్లో, 7×4, 2×6), మాక్స్‌వెల్‌ (54; 36 బంతుల్లో, 3×4, 3×6) అర్ధశతకాలతో చెలరేగడంతో భారత్‌కు ఆస్ట్రేలియా 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు

Updated : 08 Dec 2020 15:42 IST

భారత్‌ లక్ష్యం 187 పరుగులు

ఇంటర్నెట్‌డెస్క్: మాథ్యూ వేడ్‌ (80; 53 బంతుల్లో, 7×4, 2×6), మాక్స్‌వెల్‌ (54; 36 బంతుల్లో, 3×4, 3×6) అర్ధశతకాలతో చెలరేగడంతో భారత్‌కు ఆస్ట్రేలియా 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన కెప్టెన్‌ ఫించ్‌ను సుందర్‌ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేర్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్మిత్‌ (24; 23 బంతుల్లో, 1×4)తో కలిసి వేడ్‌ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే బౌండరీలు సాధించారు. దీంతో ఆ జట్టు పవర్‌ప్లేలో 51 పరుగులు చేసింది. అయితే స్మిత్‌ను బోల్తాకొట్టించి 65 పరుగుల వారిద్దరి భాగస్వామ్యానికి సుందర్‌ తెరదించాడు.

ఆ తర్వాత కోహ్లీసేనకు ఆసీస్‌ అవకాశమే ఇవ్వలేదు. మాక్స్‌వెల్‌తో కలిసి వేడ్‌ దూకుడుగా ఆడాడు. మాక్సీ స్విచ్‌షాట్లు, లాఫ్టెడ్‌ షాట్ల ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే 13వ ఓవర్‌లో చాహల్‌ బౌలింగ్‌లో మాక్సీ వికెట్‌ కీపర్‌ రాహుల్‌ చేతికి చిక్కాడు. కానీ అది నోబాల్‌‌ కావడంలో భారత్‌కు నిరాశ తప్పలేదు. అనంతరం మాక్స్‌వెల్ టాప్‌గేర్‌లో రెచ్చిపోయాడు. వేడ్‌తో కలిసి సిక్సర్ల మోత మోగించాడు. ఆయితే శార్దూల్, నటరాజన్‌ ఆఖరి రెండు ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి వికెట్లు తీయడంతో ఆసీస్‌ స్కోరు 200 దాటలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పేలవంగా ఫీల్డింగ్‌ చేసింది. సులువైన క్యాచ్‌లు జారవిడిచింది. భారత బౌలర్లలో సుందర్‌ రెండు, శార్దూల్‌, నటరాజన్‌ చెరో వికెట్ తీశారు.

ఇదీ చదవండి..

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ సాగిందిలా.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని